Dsc merrit: డీఎస్సీలో సిక్కోలు సత్తా
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:26 AM
Ranks in the merit list ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి శుక్రవారం రాత్రి విడుదలైన మెరిట్ జాబితాలో జిల్లావాసులు సత్తాచాటారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 543 పోస్టులు ఉండగా, అందులో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు 113(ఏజెన్సీతో కలిపి) ఉన్నాయి.
మెరిట్ జాబితాలో జిల్లావాసులకు ర్యాంకులు
రేపు సర్టిఫికెట్ల పరిశీలన..
28న ఎంపిక జాబితా ప్రకటించే అవకాశం
ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామక ఉత్తర్వులు
నరసన్నపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి శుక్రవారం రాత్రి విడుదలైన మెరిట్ జాబితాలో జిల్లావాసులు సత్తాచాటారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 543 పోస్టులు ఉండగా, అందులో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులు 113(ఏజెన్సీతో కలిపి) ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులకు సంబంధించి 6,032 మంది పరీక్ష రాయగా.. మార్కుల ప్రాతిపదికన మెరిట్ జాబితా విడుదల చేశారు. తొలి 12 స్థానాల్లో మొదటిస్థానం మినహా.. మిగిలిన స్థానాల్లో మహిళలు సత్తాచాటారు. ఎస్జీటీలో జిల్లాకు చెందిన అన్నెపు సింహాద్రినాయుడు 96.40 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. కుంచాల జ్యోతి 93.96, డోల శిరీష 92.36, మంతెన అనురాధ 92.24 మార్కులతో మొదటినాలుగు స్థానాలు పొందారు. 90 మార్కులు దాటి 16 మంది, 80 మార్కులు దాటిన వారిలో 170 మంది అభ్యర్థులు ఉన్నారు.
స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో 1,038 మంది పరీక్షలు రాశారు. మీసాల గోవిందరావు 85.43 మార్కులతో ప్రథమస్థానం, సారవకోట సౌమ్య 83.96 మార్కులతో ద్వితీయ స్థానం, బెజ్జిపురం వెంకటరమణ 83.5 మార్కులు, బొడ్డేపల్లి యామిని కుమారి 82.41 మార్కులతో నాల్గోస్థానం పొందారు.
స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో 416 మంది పరీక్షలు రాశారు. వీరిలో లంకా చక్రపాణి 85.55 మార్కులతో మొదటిస్థానం, సీహెచ్.భారతి 85.25 మార్కులతో రెండోస్థానం, నక్క అరుణ 78.10 మార్కులతో మూడోస్థానం, జి. ధనలక్ష్మి 76.20 మార్కులతో నాల్గోస్థానం సాధించారు.
స్కూల్ అసిస్టెంట్ ఒరియా విభాగంలో 16 మంది పరీక్షలు రాశారు. జి.సంతోష్ 79.90 మార్కులు, ఎస్.మోజ్జి 78.10 మార్కులతో మొదటి రెండు స్థానాలు పొందారు.
స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 1735 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. జీరు సత్యనారాయణ 90.21 మార్కులతో మొదటిస్థానం, పి.ధర్మారావు 88.01 మార్కులతో ద్వితీయస్థానం, ఆర్.షణ్ముఖరావు 87.66 మార్కులతో తృతీయస్థానం, జి.శంకరరావు 84.04 మార్కులతో నాల్గోస్థానం సాధించారు.
బయాలజీ విభాగంలో 1,880 మంది పరీక్షలు రాశారు. వీరిలో గరుగుబిల్లి రాంబాబు 88.57మార్కులతో మొదటిస్థానం, కనకపల్లి మహేష్‌బాబు 86.36 మార్కులతో ద్వితీయస్థానం, పిసిని దేవప్రసాద్ 85.60 మార్కులతో తృతీయస్థానం పొందారు.
స్కూల్ అసిస్టెంట్ గణితంలో 2,684 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా, కుశెట్టి ఈశ్వరరావు 88.80 మార్కులతో ప్రథమస్ధానం, వీ.వై.మల్లేశ్వరరావు 87.82 మార్కులతో ద్వితీయస్థానం, కర్రి వెంకటనవ్య 87.64 మార్కులతో తృతీయస్థానం పొందారు.
ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 1,362 మంది పరీక్షలు రాశారు. వీరిలో దుబ్బ హరికృష్ణ 90.5 మార్కులతో ప్రథమస్థానం, పిలక శివాజీ 90 మార్కులతో ద్వితీయ స్థానం, బొకెల శ్రీనాథ్ 89.5 మార్కులతో తృతీయస్థానం సాధించారు.
ఫిజికల్ సైన్స్ విభాగంలో 976 మంది పరీక్షలు రాశారు. మొజ్జ శంకరరావు 86.74 మార్కులతో ప్రథమస్థానం, సుంకర అప్పన్న 84.32 మార్కులతో ద్వితీయస్థానం, బినిశెట్టి సతీష్ 84.20 మార్కులతో తృతీయస్థానం సాధించారు.
స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో 2,976 మంది పరీక్షలకు హాజరయ్యారు. కూర్మాన నిరోష 89.55 మార్కులతో మొదటిస్థానం, పెండి బాలకృష్ణ 88.89 మార్కులతో ద్వితీయస్థానం, బొజ్జ హారిష్ 88.53 మార్కులతో తృతీయస్థానం సాధించారు.
పారదర్శకంగా నియామకాలు
డీఎస్సీ నియామకాల విషయంలో రాష్ట్ర విద్యాశాఖ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఘటనల దృష్ట్యా అక్రమాలకు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నియామకాల పక్రియకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో కొన్ని కమిటీలు వేసి అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేవారు. ముందుగానే ఏ సజ్జెక్టుకు ఏ టీమ్ సభ్యులు ఉన్నారో తెలిసిపోయేది. అందులో అనుకూలమైన వారితో సర్టిఫికెట్లలో కొన్ని పొరపాటు ఉన్నా ఓకే చేయించుకుని వెళ్లేవారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నాన్‌లోకల్ వారు లోకల్‌గా చదివినట్లు బోగస్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందినట్టు విమర్శలు ఉన్నాయి. ఈసారి అలాంటి వాటికి అవకాశం లేకుండా సర్టిఫికెట్ల పరిశీలనలో గోప్యత పాటిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థుల ఫోన్‌కు సర్టిఫికెట్ల పరిశీలన తేదీ, కేంద్రం, కమిటీ వివరాలను పంపనున్నారు.
ఈ నెల 25న శ్రీకాకుళం మహాలక్ష్మి నగర్ కాలనీలోని విశ్వవిజేత జూనియర్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 12 బృందాలను నియమించారు. ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేయించున్న వెంటనే ఆన్‌లైన్ ఓకే అయిపోతుంది. ఒకవేళ సమస్యలు ఉత్పతన్నమైతే పరిశీలన బృందం సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంది. ఈ నెల 28నాటికి ఎంపిక జాబితాను రోస్టర్ మేరకు ప్రకటిస్తారు. వచ్చే నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామక పత్రాలను అందజేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
సర్టిఫికెట్ల పరిశీలనకు ఇవి తప్పనిసరి
ఒరిజనల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ, బీపీఈడీ, పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. వీటితోపాటు కుల ధ్రువీకరణ, డిజెబుల్డ్ సర్టిఫికెట్, మూడో తరగతి నుంచి స్టడీ సర్టిఫికెట్లు, టెట్ మార్కుల కాపీ, డీఎస్సీ హాల్ టికెట్ కాపీ, ఆధార్ కార్డు, 5 పాస్ పోర్టు సైజుఫోటోలు ఉండాలి. సర్టిఫికెట్లన్నింటనీ అటెస్టేషన్ చేయించి (మూడు సెట్లు) ఒరిజనల్స్‌తో సహా పరిశీలనకు హాజరు కావాలి. అభ్యర్థికి సహాయకులుగా ఒక వ్యక్తిని మాత్రమే అనుమతిస్తారు. వెట్‌సైట్‌లో లాగిన్ అయి అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లను స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలి. రాష్ట్ర విద్యాశాఖ అధికారుల సూచనలు మేరకు ఏర్పాట్లు చేశామని డీఈవో రవిబాబు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలకు సంబంధించి షెడ్యూల్ రావాల్సి ఉందన్నారు.
ఎస్జీటీలో శేషాద్రినాయుడుకి రాష్ట్రస్థాయిలో ప్రధమస్థానం
పొందూరు, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ మెరిట్ జాబితాలో పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన అన్నెపు శేషాద్రినాయుడు ప్రతిభ చూపారు. ఎస్జీటీ విభాగంలో 96.4017 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించారు. తల్లిదండ్రులు ధర్మారావు, జగదాంబ ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే. శేషాద్రినాయుడు ప్రథమస్థానం సాధించడంపై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ శేషాద్రినాయుడును అభినందిస్తూ.. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే
‘నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే నేను ఈ ర్యాంకును సాధించాను. ప్రభుత్వం ఇటీవల మార్కులు విడుదల చేసినపుడే నాకు మొదటిర్యాంకు వస్తుందని తెలుసు. నాపై తల్లిదండ్రులు ఎటువంటి ఒత్తిడి చేయకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు కష్టపడి చదివాను’ అని శేషాద్రినాయుడు తెలిపారు.
తెలుగులో ధర్మారావు టాప్
జి.సిగడాం, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ మెరిట్ జాబితాలో జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామానికి చెందిన పట్నాన ధర్మారావు టాపర్‌గా నిలిచారు. పీజీటీ తెలుగులో 85.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించారు. అలాగే టీజీటీ తెలుగు విభాగంలో 82.57 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ స్థానం, జోన్ పరిధిలో 5వ స్థానంలో నిలిచారు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో 88.01 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానం పొందారు. ధర్మారావు ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఉత్తరాంధ్ర బాలల కఽథా సాహిత్యం-సామాజికత అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. నిరుపేద వడ్రంగి కుటుంబంలో పుట్టిన ధర్మారావు విజయమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఇటు తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చారు. ధర్మారావును తల్లిదండ్రులు లక్ష్మి, తిరుపతిరావుతోపాటు గ్రామస్థులు అభినందించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్య జర్రా అప్పారావు, పీహెచ్‌డీ పర్యవేక్షకులు అయ్యగారి సీతారత్నం, నామ విజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు.
‘ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ధృడ సంకల్పంతో కష్టపడి చదివాను. తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించాను. కష్టానికి తగిన ఫలితం దక్కినందుకు ఆనందంగా ఉంద’ని ధర్మారావు తెలిపారు.