Share News

Kidney problem : కిడ్నీవ్యాధుల్లో సిక్కోలు అగ్రస్థానం

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:09 AM

Kidney diseases దశాబ్దాలుగా జిల్లాలో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కిడ్నీ బాధితులు సిక్కోలులోనే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో మరోసారి స్పష్టమైంది. వ్యాధికి గల కారణాలు, పరిస్థితులపై అధ్యయనం చేసి తద్వారా రోగాలు నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది.

Kidney problem : కిడ్నీవ్యాధుల్లో సిక్కోలు అగ్రస్థానం
పలాసలో డయాలసిస్‌ సేవలు పొందుతున్న కిడ్నీ బాధితులు (ఫైల్‌)

  • రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలోనే అత్యధిక కేసులు

  • తర్వాత స్థానంలో క్షయ, డయేరియా రోగాలు

  • ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌’లో భాగంగా వైద్య పరీక్షలు

  • ప్రభుత్వ నివేదిక వెల్లడి

  • శ్రీకాకుళం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా జిల్లాలో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కిడ్నీ బాధితులు సిక్కోలులోనే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో మరోసారి స్పష్టమైంది. వ్యాధికి గల కారణాలు, పరిస్థితులపై అధ్యయనం చేసి తద్వారా రోగాలు నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా తీసుకుంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌’ సాధనలో భాగంగా అన్ని వయసుల వారిలో కొంతమందికి వైద్యపరీక్షలు చేపట్టింది. ఇందులో కిడ్నీ రోగాలతోపాటు క్షయ, డయేరియా వంటి వ్యాధుల్లో జిల్లా ముందంజలో ఉందని నిర్ధారణ అయింది. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు రోగాలను ముందస్తుగా నియంత్రించే అవకాశముందని ప్రభుత్వం నివేదిక వెల్లడించింది.

  • జిల్లాలో పరీక్షలు.. రోగుల సంఖ్య...

  • రాష్ట్రంలో 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారని ప్రస్తుతం నిర్ధారణ అయ్యింది. ఇందులో పురుషులు 1,22,672 మంది, మహిళలు 50,807 మంది ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 11,153 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు వెల్లడైంది. ఇందులో 40నుంచి 60ఏళ్లలోపు వారే అధికం. సిక్కోలు తర్వాత స్థానంలో పల్నాడు, గుంటూరు జిల్లాలు నిలిచాయి.

  • టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధుల్లో కూడా శ్రీకాకుళం జిల్లా ముందంజలో నిలవడం విచారకరం. అలాగే అనీమియా, ప్రీ టర్మ్‌ బర్త్స్‌, మాల్‌ న్యూట్రిషియన్‌ సమస్యలతో బాధపడేవారు కూడా జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. హైపర్‌టెన్షన్‌తో 88,664 మంది, షుగర్‌ - 38,401 మంది, నరాల సమస్య - 6,431మంది, శ్వాసకోస వ్యాధులు - 2,945 మంది, కాలేయం జబ్బులు - 1,719 మంది, క్యాన్సర్‌ - 5,711 మంది, గుండె జబ్బులతో 11,967 మంది బాధపడుతున్నట్లు వైద్యపరీక్షల ద్వారా నిర్ధారణ అయ్యింది. వ్యాధుల బారిన పడినవారిలో 35 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారు.

  • మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు

  • గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, మెదడు స్ట్రోక్‌లకు ప్రధాన కారణాలు హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, ఊబకాయమే. ఈ వ్యాధులను నియంత్రించడానికి ఉప్పు, చక్కెర, నూనె వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నివేదికలో సూచించింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లే వ్యాధుల వ్యాప్తికి కారణమని స్పష్టం చేసింది. కనీసం ముప్పై నిమిషాల శారీరక వ్యాయామం లేదా నడక, యోగా చేయడం వల్ల రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి. ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, జంక్‌ ఫుడ్స్‌, పాలిష్‌ చేసిన బియ్యాన్ని తీసుకోరాదు. మిల్లెట్లు, బ్రౌన్‌ రైస్‌ను తీసుకోవాలి. మరింత మెరుగైన ఆరోగ్యం కోసం పండ్లు, తాజాకూరగాయలు, ప్రొటీన్‌, తగినంత ఫైబర్‌ ఉండే సమతుల్య ఆహారం తీసుకుంటే రోగాలు ప్రబలకుండా నియింత్రించుకునే అవకాశముంది. పురుగుమందుల అధిక వినియోగం కారణంగా ‘పంజాబ్‌’ రాష్ట్రం క్యాన్సర్‌కు రాజధానిగా మారింది. వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే.. ఔషధంగా ఆహారాన్నే.. వంటగదినే ఫార్మశీగా ఉపయోగించాలని నివేదికలో సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమే. క్లోరినేటెడ్‌ నీటిని తాగితే.. కొంతమేర వ్యాధులు రాకుండా ఉంటాయని నివేదికలో పొందుపరిచారు.

  • సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలు..

  • జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో పీపీపీ పద్ధతిలో వంద నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిల అభివృద్ధి జరుగనుంది. ప్రభుత్వం జూన్‌ నెలాఖరున పూర్తిస్థాయిలో అన్ని జిల్లాల్లో స్ర్కీనింగ్‌ జరిపాక.. నియోజకవర్గాల్లో ఆసుపత్రిలను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఆధునాతన, ఉన్నతస్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను దగ్గర చేయడమే లక్ష్యంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలు అభివృద్ధి చేయనున్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:09 AM