Share News

minister achhenna : జిల్లా రూపురేఖలు మారుస్తా

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:53 PM

District Development ‘సిక్కోలులో సుదీర్ఘ తీర ప్రాంతం, పుష్కలమైన నీటి వనరులు ఉన్నా తలసరి ఆదాయంలో జిల్లా చివరిస్థానంలో ఉండడం విచారకరం. జిల్లాను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పీ-4 పద్ధతిలో అభివృద్ధి చేస్తాం. ఐదేళ్లలో జిల్లాకేంద్రం రూపురేఖలు మారుస్తామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

minister achhenna : జిల్లా రూపురేఖలు మారుస్తా
జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌

  • ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం

  • టీడీపీతోనే బీసీలకు సముచిత స్థానం

  • బీసీ భవన సముదాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • జ్యోతిబా పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • అరసవల్లి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘సిక్కోలులో సుదీర్ఘ తీర ప్రాంతం, పుష్కలమైన నీటి వనరులు ఉన్నా తలసరి ఆదాయంలో జిల్లా చివరిస్థానంలో ఉండడం విచారకరం. జిల్లాను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పీ-4 పద్ధతిలో అభివృద్ధి చేస్తాం. ఐదేళ్లలో జిల్లాకేంద్రం రూపురేఖలు మారుస్తామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పొన్నాడ వంతెన సమీపంలోని పార్కులో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌లతో కలిసి జ్యోతిబా పూలే విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాంబే కాలనీ వద్ద రూ.5కోట్లతో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ భవన సముదాయాన్ని(బీసీ భవన్‌) ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలారే తప్ప.. ఎవరూ పట్టించుకోలేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి దేశంలోనే తొలిసారి బీసీలకు పదవుల్లో 27 శాతం వాటా కల్పించారు. రెసిడెన్షియల్‌ విద్యా విధానంతో లక్షలాది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్యను అందజేశారు. నేడు బీసీల ఉన్నత స్థానానికి కారణం నాడు అన్న ఎన్టీఆర్‌, నేడు సీఎం చంద్రబాబునాయుడే. బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం. గతంలో రాష్ట్రంలో ఒకేసారి 65 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేయగా.. జిల్లాకు 6 స్కూళ్లు ఇచ్చాం. టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోను బీసీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. జిల్లాలో 4700 మందికి బీసీ రుణాలు మంజూరు చేశాం. ఇలా బీసీల అభివృద్ధికి చంద్రబాబు నేతృత్వంలో నిరంతర కృషి కొనసాగుతోంది. జిల్లాలో బీసీల కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి చేస్తాం. టీడీపీ హయాంలో బీసీల కోసం కొనుగోలు చేసిన పనిముట్లను గత వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసి దుర్వినియోగం చేసింది. వైసీపీకి బీసీలపై ఎందుకు అంత కక్ష. జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కృషి చేస్తుండగా కొంతమంది ఆటంకాలు సృష్టిస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరం. వలసలు ఆపాలి. పారిశ్రామికంగా వృద్ధి చెందితేనే, జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వివిధ పార్టీల నాయకులు రాజకీయాలు చెయ్యండి. కానీ అభివృద్ధిని మాత్రం దయచేసి అడ్డుకోకండి. పదవులు శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు మనం చేసే మంచి పనులే ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. అదే శాశ్వతం. జ్యోతిబాపూలే ఆశయాలను నెరవేరుద్దాం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి కృషి చేద్దామ’ని తెలిపారు. బీసీ భవన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీసీ లబ్ధిదారులకు చెక్కును అందజేశారు.

  • కలెక్టర్‌ స్వపిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘బీసీ భవన్‌ బీసీ వెల్ఫేర్‌ విభాగానికి ఒక గొప్ప ఆస్తి. అందరూ సమర్థవంతంగా పనిచేయాలి. మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉంద’ని తెలిపారు.

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘బీసీలకు సముచిత స్థానం జ్యోతిబా పూలే చలువే. గత వైసీపీ ప్రభుత్వం బీసీ భవన్‌ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే భవనాన్ని పూర్తిచేసి.. ప్రారంభించాం. ఇది మంత్రి అచ్చెన్న పట్టుదలకు నిదర్శనమ’ని తెలిపారు.

  • నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. బీసీల సంక్షేమ టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. జ్యోతిబాపూలే జయంతి రోజున బీసీ భవన్‌ను ప్రారంభించడం ఎంతో ముదావహమన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, బీసీ కార్పొరేషన్‌ ఈడీ గడ్డెమ్మ, బీసీ సంక్షేమాధికారి అనూరాధ, తహసీల్దార్‌ గణపతిరావు, బీసీ సెల్‌ అధ్యక్షుడు కలగ జగదీష్‌, మాదారపు వెంకటేష్‌, కంఠ వేణు, ఎస్వీ రమణమాదిగ, రత్నాల మురళీమోహన్‌, కిల్లాన శ్రీనివాసరావు, చౌదరి బాబ్జీ, పీరుకట్ల విశ్వప్రసాద్‌, గుత్తు చిన్నారావు, పైడిశెట్టి జయంతి పాల్గొన్నారు.


minister achhenna-1.gif

Updated Date - Apr 11 , 2025 | 11:55 PM