శ్రీకాకుళం కార్పొరేషన్‌కు 78వ ర్యాంకు
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:52 PM
Ranks for municipalities రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలకు ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటీలకు పది అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చింది. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 78వ ర్యాంకు లభించింది.
అత్యంత దిగువకు ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు
పది అంశాల ఆధారంగా సర్కారు రేటింగ్
శ్రీకాకుళం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలకు ర్యాంకులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 123 మునిసిపాలిటీలకు పది అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చింది. జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 78వ ర్యాంకు లభించింది. మొత్తం 100 మార్కులకుగానూ 50 పాయింట్లతో మధ్యస్థంగా 5వ రేటింగ్ దక్కింది. ప్రభుత్వం తాగునీటి సరఫరా, ఇంటింటా చెత్త సేకరణ, వ్యర్థాలు, వరద నీటి నిర్వహణ, రోడ్లు, వీధి దీపాలు, ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించింది. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో వివిధ విభాగాలకు సంబంధించి లభించిన స్కోరును పరిశీలిస్తే.. నీటి సరఫరాకు - 7, ఇంటి నుంచి చెత్త సేకరణకు - 6, లెగసీ వేస్ట్(వ్యర్థ నిర్వహణ)కు - 4, పక్కా రోడ్లకు - 10, వీధి లైటింగ్‌కు - 6, ఆదాయ విభాగంలో - 10, రెవెన్యూ విభాగంలో 10 పాయింట్లు వచ్చాయి. వేస్ట్ ప్రోసెసింగ్ స్కోర్, లిక్విడ్ వేస్ట్ స్కోర్, స్టార్మ్ వేస్ట్ స్కోర్ సున్నా లభించింది. ఇంతకంటే దారుణంగా ఇచ్ఛాపురం, ఆమదాలవలస, పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీలకు 4వ ర్యాంకింగ్ లభించింది. అన్ని విషయాల్లోనూ ఈ మూడు మునిసిపాలిటీలు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.
మునిసిపాలిటీ రేటింగ్ స్కోర్ ర్యాంకు
=================================
శ్రీకాకుళం కార్పొరేషన్ 5 50 78
ఆమదాలవలస 4 33 91
ఇచ్ఛాపురం 4 35 98
పలాస-కాశీబుగ్గ 4 38 108