Share News

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:06 AM

జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గ్రామాల్లో అమ్మవారి సంబరాలు, విగ్రహ ప్రతష్ఠోత్సవాలతో సందడి నెలకొంది.

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
మెళియాపుట్టి: ముర్రాటలు తీసుకువెళుతున్న గ్రామస్థులు

పలాస, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు గ్రామాల్లో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గ్రామాల్లో అమ్మవారి సంబరాలు, విగ్రహ ప్రతష్ఠోత్సవాలతో సందడి నెలకొంది. ఇందులో భాగంగా అంతరకుడ్డ గ్రామంలో గ్రామదేవత ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సిరిమాను ఉత్సవంలో ప్రభుత్వ విప్‌, ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామమంతా పందిళ్లు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. దీంతో ఊరంతా సందడి నెలకొంది. కాశీబుగ్గ పొందరవీధిలో వెలసిన పెంటపోలమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు దంపతులు అమ్మవారికి దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

ఘనంగా గ్రామ దేవతా విగ్రహాల పునః ప్రతిష్ఠ

హరిపురం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): బాలిగాం గ్రామంలో ఆదివారం గ్రామ దేవత ఆలయాల్లో కొత్తమ్మతల్లి, పాతపట్నం అమ్మతల్లి, చింతామణి అమ్మతల్లి, కొత్తకాలమ్మ తల్లి విగ్రహాలను ఆదివారం పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూర్ణకుంభాలు, పసుపు, కుంకుమ, ముర్రాటలతో అమ్మ వార్లకు చల్లదనం చేశారు. కుంకుమ పూజ లు, శాంతి హోమం చేపట్టారు. ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన, పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

మర్రిపోలమ్మ ఉత్సవాలు ప్రారంభం

మెళియాపుట్టి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలో మర్రిపోలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు ముర్రాటలు పోసి చల్లదనం చేశారు. అలాగే ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వా హకులతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

పీవీపురం, మదనాపురంలో..

నందిగాం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రతాపవిశ్వనాథపురం, మదనాపురం గ్రామాల్లో గ్రామదేవత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ప్రతాపవిశ్వనాథపురంలో పాలపోలమ్మ, మదనాపురంలో చింతలపోలమ్మ గ్రామదేవత ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం మధ్య అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు చేసి దేవర్లను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. పలు కూడళ్ల లో దేవతామూర్తుల విగ్రహాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

శ్రీముఖలింగం ఆలయంలో..

జలుమూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలోని ముఖలింగే శ్వర ఆలయంలో ఆదివారం ఔపో షణ హోమాన్ని నిర్వహించారు. పాంచరాత్ర కల్యాణ మహోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరులకు సద్యోజాత విధానంలో పూజానంతరం ఆలయంలోని దుండి వినాయకుని వద్ద ఔపోషణ హోమం చేపట్టారు. అంతకు ముందు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, మండపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బలిహరణ చేపట్టి అష్టదిక్పాలకులకు మంగళహారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు నారాయణమూర్తి, వెంకటాచలం, అప్పారావు, యోగి, శివ, శ్రీకృష్ణ, అచ్యుత దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

జలుమూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరవంజ పంచాయతీ మట్టవానిపేటలో కొలువుదీరిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ తృతీయ వార్షికోత్సవంలో భాగంగా గ్రామ పురోహితులు తెలికిచర్ల సాంబమూర్తి ఆధ్వర్యంలో అర్చకుడు వసనాభి గురునాథరావు నేతృత్వంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. సోమవారం స్వామివారి సన్నిధిలో అన్నసంతర్పణ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Updated Date - Jun 09 , 2025 | 12:06 AM