Share News

ప్రాణం తీసిన అతివేగం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:23 AM

Two members dead in road accident పలాస మండలం పాత జాతీయరహదారి గరుడఖండి గ్రామం సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రాణం తీసిన అతివేగం
సుశాంత్‌కుమార్‌, భీమారావు (ఫైల్‌).. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

ఇద్దరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

గరుడఖండి వద్ద ఘటన

పలాస/రూరల్‌/ పాతపట్నం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): పలాస మండలం పాత జాతీయరహదారి గరుడఖండి గ్రామం సమీపంలో గురువారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు(25), పలాస మండలం వీరభద్రాపురానికి చెందిన తలగాపు వేణు ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి పలాస వస్తున్నారు. ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరి సమితి డెరబా గ్రామానికి చెందిన సుశాంత్‌జెన్నా(26) ఎదురుగా మరో ద్విచక్ర వాహనంపై వస్తూ.. గరుడఖండి సమీపంలో వారి వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు. భీమారావు, సుశాంత్‌ జెన్నా అక్కడికక్కడే మృతి చెందారు. వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి, పోలీసులు చేరుకున్నారు. భీమారావు రోడ్డుపై పడి మృతి చెందగా, సుసాంత్‌జెన్నా సమీప పొదల్లో పడి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన గంటవరకూ వారి వివరాలు లభించలేదు. సెల్‌ఫోన్ల ఆధారంగా వివరాలు గుర్తించారు. అనంతరం వారి బంధువులకు సమాచారాన్ని అందించారు. స్థానికుల సహకారంతో వేణును అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

భీమారావు, వేణు ఇద్దరూ బంధువులు. వీరభద్రాపురంలో జరిగిన ఓ వేడుకకు హాజరైనట్లు గ్రామస్థులు తెలిపారు. వీరు కాశీబుగ్గలో సొంత పనిమీద ద్విచక్రవాహనంపై వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. వేణుకు కాలు, చేయి విరిగిపోయి అపస్మారకస్థితిలో ఉన్నాడు. పలాస ప్రభుత్వాసుపత్రి నుంచి ఆయన్ను శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అలాగే భీమారావు, సుశాంత్‌ జెన్నా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు.

సరాళిలో విషాదఛాయలు

పాతపట్నం మండలం సరాళిలోని పెద్దవీధికి చెందిన భీమారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమారావు పలాస సమీపాన బి.కొత్తూరులో చిన్నాన్నవాళ్ల నూతనగృహప్రవేశానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని తల్లి లక్ష్మి, తమ్ముడు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే ఇదేప్రమాదంలో మృతి చెందిన సుశాంత్‌జెన్నా.. భార్య రీనాగొమాంగో, రెండున్నరేళ్ల కుమారుడు ఆయుష్‌కుమార్‌తో కలిసి పలాసలో నివాసం ఉంటున్నారు. హోల్‌సేల్‌ గుడ్ల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. సుశాంత్‌జెన్నా మృతితో ఇక తమకు దిక్కెవరంటూ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:23 AM