Share News

మాజీ నక్సలైట్‌ ఆజాద్‌ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:26 AM

జిల్లాకు చెందిన మాజీ నక్సలైట్‌ దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌పై ఉన్న కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు.

మాజీ నక్సలైట్‌ ఆజాద్‌ కేసుల కోసం ప్రత్యేక న్యాయస్థానం

శ్రీకాకుళం లీగల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన మాజీ నక్సలైట్‌ దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌పై ఉన్న కేసుల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం జిల్లాలో ఆయన పేరుతో ప్రత్యేక కోర్టును ప్రారంభించారు. వాస్తవానికి కేశవరావు సుమారు 12 ఏళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లొంగిపోయి రూ.5 లక్షల రివార్డు తీసుకున్నప్పటికీ తదుపరి ఒడిశా రాష్ట్రంతోపాటు ఆంధ్ర ప్రదేశ్‌లో పలు కేసులు నమోదైనట్టు సమాచారం. ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసుల వల్ల అతను ప్రస్తుతం అక్కడే జైలు జీవితం గడుపుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేపట్టాలని కేశవరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తొలుత ప్రత్యేక కోర్టు శ్రీకాకుళం ఏర్పా టైంది. ఈ కోర్టులో ఆయనపై నమోదైన 11 కేసులతో పాటు మన రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో నమోదైన ఐదు కేసులను విచారణ చేపట్టనున్నారు. ఒడిశా రాష్ట్రంలో కూడా ఇదే తరహా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అక్కడి కేసులను విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Updated Date - Oct 26 , 2025 | 12:26 AM