ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:19 AM
: ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
- కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
- కళ్లేపల్లి పీహెచ్‌సీ ప్రారంభం
శ్రీకాకుళం రూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. కళ్లేపల్లి గ్రామంలో రూ.2.60 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళ్లేపల్లి పీహెచ్‌సీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్యం చాలా ఖరీదుగా మారిందన్నారు. అనార్యోగంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే బిల్లులు కట్టేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. అందుకే ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ సేవలు వినియోగించుకుంటే లక్షల రూపాయలు ఆదా అవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ అభయ ఐడీ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐదు లక్షల ఉచిత బీమా సదుపాయం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఎంహెచ్‌వో కె.అనిత, ఆర్డీవో సాయి ప్రత్యూష, తహసీల్దార్ ఎం.గణపతి, ఎంపీడీవో వి.ప్రకాశ్‌రావు, పీహెచ్‌సీ వైద్యాధికారి టి.చిరంజీవినాయుడు, టీడీపీ నాయకులు మెండ దాసునాయుడు, అరవల రవీంద్ర, దుంగ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దగణగళ్లవానిపేటలో షెల్టర్ భవనం
పెద్దగణగళ్లవానిపేట తీరం సమీపంలో కేంద్రం నిధులు రూ.1.40కోట్లతో స్టోరేజ్ షెల్టర్ భవనం నిర్మాణానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి కోతకు గురైన సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తీరం కోతకు గురవడానికి గల కారణాలను అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో నిపుణులు ఇచ్చిన నివేదికను పరిశీలించారు. నది ప్రవాహ దిశ మారడం ప్రమాదకరమని, నేరుగా సముద్రంలో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కోతకు గురైన ప్రాంతానికి సమీ పంలో మత్స్యకారుల వేటకు అనుగుణంగా ఫిషింగ్ జెట్టీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.