Share News

కొన్నిచోట్లే సోలార్‌ కాంతులు

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:18 AM

జిల్లాలో సూర్యఘర్‌ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు.

 కొన్నిచోట్లే సోలార్‌ కాంతులు

- జిల్లాలో ‘సూర్యఘర్‌’కు ఆదరణ అంతంతే

- ఆసక్తి చూపని వినియోగదారులు

- ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు విద్యుత్‌ శాఖ సన్నాహాలు

ఇచ్ఛాపురం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూర్యఘర్‌ పథకానికి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితం, మహిళా సంఘ సభ్యులకు ప్రాధాన్యం ఇచ్చినా ఫలితం ఉండడం లేదు. డాబాలు లేకపోయినా.. ఖాళీ స్థలాల్లో సోలార్‌ పలకల ఏర్పాటుకు అవకాశమిచ్చినా ప్రజలు ముందుకు రావడం లేదు. సూర్యఘర్‌ రిజిస్ట్రేషన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను ఆహ్వానించాలని విద్యుత్‌ శాఖ చూస్తోంది. నియోజకవర్గాల వారీగా కౌంటర్లు పెట్టి వీలైనంత వరకూ ఎక్కువ యూనిట్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సైతం తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రణాళిక వేస్తోంది.

జిల్లాలో పరిస్థితి..

కేంద్ర ప్రభుత్వం పీఎం సుర్యఘర్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో గత ఏడాదిన్నర కాలంలో 2,930 మంది మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సరిగ్గా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యుత్‌ బిల్లుల భారం నుంచి తప్పించుకునేందుకు సోలార్‌ పలకలు ఏర్పాటు చేసుకోవాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. సూర్యాఘర్‌ పథకంలో భాగంగా మూడు కిలోవాట్లకు సంబంధించి రూ.78వేల వరకూ సాయం అందించనుంది. ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఇంటి అవసరాలకు పోను విద్యుత్‌ మిగిలి ఉంటే అమ్ముకోవచ్చు. డిస్కంలే కొనుగోలు చేసి ఆ నగదును లబ్ధిదారుడికి అందిస్తాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మిగులు విద్యుత్‌ అమ్ముకోవచ్చు..

ఒకసారి సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చు. ఒక కిలో వాట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునేందుకు రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి రూ.30 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రెండు కిలోవాట్ల ప్లాంట్‌ అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల ఖర్చు అవుతుంది. రూ.60 వేల వరకు సబ్సిడీ అందిస్తారు. మూడు కిలోవాట్లు అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20 లక్షల ఖర్చు అవుతుంది. రూ.90 వేల వరకు రాయితీ పొందవచ్చు. ఇంటి అవసరాలకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటే.. చాలా వరకూ మిగలనుంది. దానిని డిస్కంలకు అమ్ముకోవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి..

సూర్యఘర్‌పై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఇంటిపైన, ప్రాంగణాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి రాయితీ సైతం అందిస్తాం. మిగులు విద్యుత్‌ను సైతం డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఇది మేలైన పథకం. వినియోగాదారులు సద్వినియోగం చేసుకోవాలి.

-కృష్ణమూర్తి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, శ్రీకాకుళం

Updated Date - Nov 06 , 2025 | 12:18 AM