RIMS: రిమ్స్‌లో సమస్యలెన్నో?
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:09 AM
Medical College Issues శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్-జీజీహెచ్)లో సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ప్రతివార్డులోనూ సమస్యలు దర్శనమిస్తూనే ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సక్రమంగా సేవలు అందక.. ఆస్పత్రులో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
పనిచేయని లిఫ్ట్‌లు
అరకొరగా సిబ్బంది
సక్రమంగా అందని సేవలు
అరసవల్లి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్-జీజీహెచ్)లో సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ప్రతివార్డులోనూ సమస్యలు దర్శనమిస్తూనే ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. కానీ సక్రమంగా సేవలు అందక.. ఆస్పత్రులో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రోగులపాట్లు వర్ణణాతీతం. తరచూ లిఫ్ట్‌లు మొరాయిస్తున్నాయి. ఇటీవల లిఫ్ట్ మధ్యలో నిలిచిపోగా.. అందులో ఆరుగురు రోగులు, వారి బంధువులు నానా అవస్థలు పడి.. బయటకు వచ్చారు. అలాగే గైనిక్‌వార్డుకు అనుబంధంగా ఉన్న లిఫ్ట్ తరచూ మొరాయిస్తూనే ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో గర్భిణీలను పరీక్షిస్తారు. ల్యాబ్‌రూమ్ కూడా కిందనే ఉంది. సర్జరీ, లేదా ప్రసవం కోసం గర్భిణులను మూడో ఫ్లోర్‌కు తరలించేటప్పుడు లిఫ్ట్ పనిచేయకపోతే నరకయాతన పడుతున్నారు. అలాగే చిన్నపిల్లల విభాగానికి వెళ్లే మార్గంలో సీలింగ్ పెచ్చులూడి భయానకంగా తయారైంది. అక్కడే ఆర్‌ఎంవో చాంబర్ ఉన్నా.. కనీసం మరమ్మతులు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
930 బెడ్స్... ముగ్గురే ఎలక్ట్రీషియన్లు...
గతంలో 450 బెడ్స్ ఉన్నప్పుడు ఆస్పత్రి అవసరాలకు సంబంధించి 12మంది ఎలక్ట్రీషియన్లు ఉండేవారు. నేడు 930 పడకలుగా అప్‌గ్రేడ్ అయినా.. కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉండడం గమనార్హం. కరోనా సమయంలో ఆస్ప్రతిలో 15మంది ఎలక్ట్రీషియన్లు, ఐదుగురు లిఫ్టు ఆపరేటర్లు, ప్లంబర్లను నియమించారు. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో సిబ్బంది అవసరం. కానీ లేరు. జనరేటర్లు, సబ్‌స్టేషన్, పవర్ ప్యానల్స్ మెయింటెనెన్స్ కోసం 12 మంది సిబ్బంది ఉండాలి. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ శాఖ.. ఎవరినీ నియమించలేదు. ఎలక్ట్రీషియన్లే లిఫ్టు ఆపరేటర్లుగా తాత్కాలికంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో తరచూ విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో కేబుల్స్ కాలిపోతున్నాయి. ముగ్గురితోనే ఎలా నెట్టుకొస్తున్నారో... ఆ దేవుడికే తెలియాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని రోగులు ప్రశ్నిస్తున్నారు.
ఫిర్యాదు పెట్టెలు ఎక్కడా?
ఆస్ప్రతిలో రోగులకు, సక్రమంగా వైద్యసేవలు అందకపోయినా.. ఇతర ఇబ్బందులు ఎదురైనా ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి. సేవల్లో లోపాలు ఎదురైతే.. రోగులు ఫిర్యాదు చేసేలా.. ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేస్తామని ఆస్పత్రి అధికారులు గతంలో ప్రకటించారు. కానీ, ఎక్కడా ఫిర్యాదు పెట్టెలు కానరావడం లేదు. ఫిర్యాదు పెట్టెలతోపాటు ఆస్పత్రిలో ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్ ఫోన్ నెంబర్లను అన్ని విభాగాల వద్ద కనిపించేలా ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
అభివృద్ధి కమిటీ సమావేశం ఎప్పుడో...?
కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయినా.. ఇంతవరకూ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్) సమావేశం నిర్వహించలేదు. ఆస్పత్రిలో సమస్యలు, అవసరాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర అవగాహన, బాధ్యత ఉండాలంటే.. హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రిమ్స్‌లో సమస్యల పరిష్కారంతోపాటు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.