child accident: తల్లిదండ్రుల కళ్ల ముందే..
ABN , Publish Date - May 20 , 2025 | 12:17 AM
Tragic incident Six-year-old boy వేసవి సెలవులు కావడంతో ఆ ఆరేళ్ల బాలుడు.. తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. వారితో ఒకరోజు సరదాగా ఆడుతూ పాడుతూ గడిపాడు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి తన ఇంటికి ఆటోలో వెళ్లేందుకుగానూ తల్లిదండ్రులతో కలిసి రోడ్డుకు చేరుకున్నాడు. తండ్రి రోడ్డును దాటి అవతలివైపు వెళ్లగా.. అప్పటివరకూ అమ్మ చేయి పట్టుకున్న ఆ బాలుడు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినిపించుకోకుండా రోడ్డు దాటుతుండగా.. ఘోరం జరిగిపోయింది.
ఆరేళ్ల బాలుడు మృతి
రోడ్డు దాటుతుండగా.. ఢీకొన్న ద్విచక్ర వాహనం
ఎరుకలపేట కూడలి వద్ద ప్రమాదం
పొందూరు, మే 19(ఆంద్రజ్యోతి): వేసవి సెలవులు కావడంతో ఆ ఆరేళ్ల బాలుడు.. తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. వారితో ఒకరోజు సరదాగా ఆడుతూ పాడుతూ గడిపాడు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి తన ఇంటికి ఆటోలో వెళ్లేందుకుగానూ తల్లిదండ్రులతో కలిసి రోడ్డుకు చేరుకున్నాడు. తండ్రి రోడ్డును దాటి అవతలివైపు వెళ్లగా.. అప్పటివరకూ అమ్మ చేయి పట్టుకున్న ఆ బాలుడు కూడా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినిపించుకోకుండా రోడ్డు దాటుతుండగా.. ఘోరం జరిగిపోయింది. ద్విచక్ర వాహనం బలంగా ఢీకొనడంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లముందే రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే సపర్యలు చేసి.. ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించేలోపు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పొందూరు మండలం ఎరుకలపేట కూడలివద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేడాడ యువంత్ అనే ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. యువంత్‌ది పొందూరు మండలం గోకర్ణపల్లిపేట పంచాయతీ రంగనాథపేట. స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదివాడు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఆదివారం తల్లిదండ్రులు హరిబాబు, ఈశ్వరమ్మతో కలిసి ఎరుకలపేటలో ఉన్న తన చినతాత ఇంటికి వెళ్లాడు. ఆదివారం కుటుంబ సభ్యులు, బంధువులతో సరదాగా గడిపాడు. సోమవారం సాయంత్రం ఆ ముగ్గురూ తిరుగుపయనానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆటో కోసం ఎరుకులపేట కూడలి వద్దకు చేరుకున్నారు. తండ్రి హరిబాబు రోడ్డు నుంచి అవతలి వైపునకు వెళ్లాడు. తల్లి చేతిని విడిపించుకుని యువంత్ కూడా తండ్రి వద్దకు వెళ్లాలనే ఆతృతతో రోడ్డు దాటాలని ప్రయత్నించాడు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా.. రోడ్డు దాటుతుండగా, అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరువైపు వస్తున్న ద్విచక్రవాహనం ఆ బాలుడిని బలంగా ఢీ కొట్టింది. దీంతో యువంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్థానికుల సహాయంతో వెంటనే పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి యువంత్‌ను తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్)కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడికి తరలించి చికిత్స అందించేలోగా యువంత్ మృతి చెందాడు. ఆడుతూపాడుతూ ఉన్న తమ కుమారుడు కళ్లముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొందూరు ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మైనర్ అని గుర్తించామని, అదుపులోకి తీసుకున్నామన్నారు.