Share News

Dccb: డీసీసీబీ చైర్మన్‌గా శివ్వాల

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:24 PM

DCCB Chairman జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌గా సరుబుజ్జిలి మండలం షలంత్రి గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు శివ్వాల సూర్యనారాయణను ప్రభుత్వం నియమించింది.

Dccb: డీసీసీబీ చైర్మన్‌గా శివ్వాల
శివ్వాల సూర్యనారాయణ, చౌదరి అవినాష్‌

  • సరుబుజ్జిలి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌గా సరుబుజ్జిలి మండలం షలంత్రి గ్రామానికి చెందిన సీనియర్‌ టీడీపీ నాయకుడు శివ్వాల సూర్యనారాయణను ప్రభుత్వం నియమించింది. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. 1959లో రామన్న, నీలమ్మ దంపతులకు జన్మించారు. షలంత్రి సర్పంచ్‌గా సుమారు 13ఏళ్లు కొనసాగారు. 1996లో ఆయన సతీమణి కృష్ణవేణి జడ్పీటీసీగా సేవలందించారు. 2006లో సూర్యనారాయణ జడ్పీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం షలంత్రి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. సరుబుజ్జిలి మండల టీడీపీ అధ్యక్షుడిగా 21 ఏళ్లు బాధ్యతలు చేపట్టారు. జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా కొనసాగారు. గతేడాది శాసనసభ ఎన్నికల్లో సాలూరు, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర పార్టీ పరిశీలకుడిగా వ్యవహరించారు. వివాదరహితుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన తనకు జిల్లాస్థాయిలో ప్రత్యేక స్థానం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే రవికుమార్‌కు శివ్వాల కృతజ్ఞతలు తెలిపారు. సేవలకు తగిన గుర్తింపు లభించిందంటూ డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన శివ్వాలకు పలువురు టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు.

  • డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా చౌదరి అవినాష్‌

  • ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) అధ్యక్షుడిగా ఎస్‌.ఎం.పురం గ్రామ మాజీ సర్పంచ్‌, టీడీపీ యువ నాయకుడు చౌదరి అవినాష్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ విధేయతకు కేరాఫ్‌గా నిలిచిన ఈ కుటుంబానికి డీసీఎంఎస్‌ అధ్యక్ష పదవిని అప్పగించడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన అవినాష్‌ 2013-18 మధ్య ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా పని చేశారు. ఈయన తండ్రి చౌదరి నారాయణమూర్తి(బాబ్జీ) జడ్పీ విప్‌గా, వైస్‌ చైర్మన్‌గా, జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తల్లి చౌదరి ధనలక్ష్మి జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అవినాష్‌ తాతయ్య చౌదరి సత్యనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందడమే కాకుండా రెండుసార్లు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. యువకుడు, విద్యావంతుడైన అవినాష్‌కు డీసీఎంఎస్‌ పదవి ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఇదే నియోజకవర్గం రణస్థలం మండలానికి చెందిన దివంగత డి.సత్యేంద్రవర్మ కూడా డీసీఎంఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు.

Updated Date - Apr 28 , 2025 | 11:24 PM