సీదిరి సార్.. ఏంటీ వ్యాఖ్యలు?
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:53 PM
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిపై మాజీ మంత్రి, పలాస వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు నోరుపారేసుకున్నారు.
ఎస్పీపై నోరుపారేసుకున్న మాజీ మంత్రి
కాశీబుగ్గ సీఐపైనా అనుచిత వ్యాఖ్యలు
కార్యకర్తను విడిపించడానికి అర్ధరాత్రి హైడ్రామా
పలాస, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిపై మాజీ మంత్రి, పలాస వైసీపీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు నోరుపారేసుకున్నారు. కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తను విడిపించడం కోసం మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు కార్యకర్తలతో వచ్చి ఆయన హైడ్రామా సృష్టించారు. వైసీపీ ఇటీవల నకిలీ మద్యంపై చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్త వేణుగోపాలరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంగళవారం రాత్రి ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అప్పలరాజు తమ కార్యకర్తలతో కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. తప్పుచేయని వారిని స్టేషన్‌కు ఎలా తీసుకువస్తారని ఎస్పీపై చిందులు తొక్కారు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు ప్రదర్శిస్తూ సీదిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఐ సూర్యనారాయణ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆయనపైనా మేము ఫిర్యాదు చేస్తాం. ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. ఎస్పీకి తెలిసే ఇక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. ట్రైనీగా ఉన్న సమయంలో ఆయనపైనా కేసులు ఉన్నాయి. ఆయన మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను పోలీసు బాస్‌లను చేస్తే ఇటువంటివే జరుగుతాయి. జగన్ సార్.. ఇటువంటి ఎస్పీలను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి’ అంటూ సీదిరి చిందులు తొక్కారు.
అప్పలరాజుతో సహా ఇద్దరిపై కేసు నమోదు
మహిళా కానిస్టేబుల్, హోమ్‌గార్డుపై దాడి చేయడంతో పాటు అనుచితంగా వ్యవహరించారనే అభియోగంపె వైసీపీ సోషల్‌మీడియా సభ్యుడు, ఆ పార్టీ కార్యకర్త వేణుగోపాలరెడ్డితో సహా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై బుధవారం కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుగోపాలరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. అప్పలరాజు ప్రోత్సాహంతో వేణుగోపాలరెడ్డి.. కానిస్టేబుల్‌పై దాడికి దిగారని అభియోగం ఉందని ఎస్‌ఐ నర్సింహమూర్తి తెలిపారు. కాగా, ఐదు రోజుల కిందట జరిగిన ఆందోళన కార్యక్రమం ఈ వ్యవహారానికి కారణమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 26 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.