దిగొచ్చిన వెండి
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:11 AM
Falling silver prices బంగారం, వెండి ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులు ఊరట చెందగా.. ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు.
తగ్గుతున్న ధరలు
నెలలో కిలోపై రూ.30వేల వరకు తగ్గిన వైనం
బంగారం కూడా వారంలో 10 గ్రాములపై రూ.5వేలు తగ్గింపు
డీలా పడుతున్న మదుపరులు
నరసన్నపేట, నవంబరు 21(ఆంధ్రజ్యోతి):
గత నెల అక్షయ తృతీయనాడు నరసన్నపేటకు చెందిన ఒక ఉపాధ్యాయుడు కిలో వెండి రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశారు. మూడు రోజుల తర్వాత కిలో వెండి రూ.1.90 లక్షలకు చేరడంతో తనకు భవిష్యత్‌లో మరింత లాభం వస్తుందని ఆనందపడ్డారు. కానీ, తర్వాత వెండి ధర క్రమేపీ తగ్గుతూ.. ప్రస్తుతం కిలో రూ.1.60లక్షలకు దిగి రావడంతో దిగులు చెందుతున్నారు.
శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక ఉద్యోగి దాచుకున్న సొమ్మునంతా గత నెలలో వెండి మీద పెట్టుబడి పెట్టారు. కిలో రూ.1.65 లక్షలు చొప్పున మూడు కేజీల వెండి కొనుగోలు చేశారు. తీరా రోజురోజుకు వెండి ధరలు పతనం కావడంతో ఇంట్లో ఉంచుకోలేక.. అమ్ములేక సతమతమవుతున్నారు. భవిష్యత్‌తో వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిసి గగ్గోలు చెందుతున్నారు.
బంగారం, వెండి ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులు ఊరట చెందగా.. ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది బంగారం, వెండి ధరలు పెరిగాయి. భవిష్యత్‌లో మరింత ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఉద్యోగులు, వ్యాపారులు బంగారం, వెండి మీద పెట్టుబడి పెట్టారు. రియల్‌ఎస్టేట్ రంగం డీలా పడడం, స్టాక్‌మార్కెట్ ఒడిదొడుకుల నేపథ్యంలో మదుపరులు బంగారం, వెండి కొనుగోలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లాలో గత నెలలో సుమారు రూ.200కోట్ల వరకు వెండి, రూ.100 కోట్ల మేర బంగారంపై పెట్టుబడి పెట్టారు. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, టెక్కలి, ఆమదాలవలస, సోంపేట తదితర పట్టణాల్లో హోల్‌సేల్ వ్యాపారుల వద్ద ఫ్యూర్ వెండి, బంగారం బిస్కెట్లు, బాండ్లు కొనుగోలు చేశారు. కాగా 15 రోజులుగా వెండి ధర తగ్గుతోంది. దీపావళి నాటికి కిలో వెండి రూ.1.90 లక్షలు ఉండగా, శుక్రవారం నాటికి రూ.1.60 లక్షలకు పడిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే కిలోపై రూ.30వేలు తగ్గగా.. భవిష్యత్‌లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మదుపరులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధర కూడా గత పదిహేను రోజుల్లో 10 గ్రామాలకు రూ.5వేల వరకు తగ్గింది. దీపావళి నాటికి పది గ్రామల 24 క్యారెక్టు బంగారం ధర 1.32 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.1.26 లక్షలకు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి. డాలర్ మారకం విలువ పెరిగింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయని బులియన్ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు యూఎస్‌ఏలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ ధర తగ్గిస్తుందని ముందుగా భావించడంతో బంగారం, వెండిపై భారీగా మదుపరులు పెట్టుబడి పెట్టారు. అయితే ఇటీవల ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించనట్టు ప్రకటించింది. దీంతో వెండి, బంగారం ధరలు తగ్గుదలకు ఇదొక కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
మదుపరులు తగ్గుతున్న ధరలను చూసి.. తమ వద్ద ఉన్న బంగారం, వెండి విక్రయించేందుకు షాపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే అంత మొత్తంలో డబ్బులు ఇప్పుడు ఇవ్వలేమని.. కొద్ది రోజులు సమయం కావాలని వ్యాపారులు చెబుతుఆ్నరు. దీంతో కొందరు గత్యంతరం లేక విక్రయిస్తుండగా.. మరికొందరు మాత్రం భవిష్యత్‌లో వాటి ధర పెరుగుతుందనే ఆశతో ఉన్నారు.
ఊహించలేదు
బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఊహించలేదు. భవిష్యత్‌లో పిల్లల చదువు కోసం వెండి మీద పెట్టుబడి పెట్టాం. ఒక్కసారిగా ధరలు తగ్గుతున్నాయి. నష్టమో.. లాభమో కొంత వెండి విక్రయించి.. మరికొంత భవిష్యత్ కోసం దాచుకుంటున్నాం. బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టడం కొంతవరకు పెట్టుబడుదారులకు నష్టమే.
- వి.రామారావు, ఉపాధ్యాయుడు, నరసన్నపేట
వ్యాపారాలు పెరుగుతున్నాయి
వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొందరు భవిష్యత్ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారాలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఒక తగ్గుతోంది. మరో రోజు పెరుగుతోంది. గత రెండు వారాల్లో బంగారం ధర 10 గ్రామలకు రూ.5వేల వరకు తగ్గింది. వెండి కిలోకు రూ.30వేల వరకు తగ్గింది.
- నానాజీ గాడ్గె, బంగారం వ్యాపారి, నరసన్నపేట