Silver Jubilee celebrations: జిల్లా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:13 AM
srikakulam celebrations జిల్లా ఆవిర్భావ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆవిర్భావ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో ఈ నెల 13 నుంచి 15 వరకు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కోడిరామ్మూర్తి స్టేడియంలో ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వేడుకల నిర్వహణకు సంబంధించి అప్పగించిన బాధ్యతను ఆయా శాఖల అధికారులు సక్రమంగా నిర్వర్తించాలి. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలి. ఆర్ట్స్ కళాశాల, కోడిరామ్మూర్తి స్టేడియంలో సాంస్కృతిక, క్రీడా, ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి’ అని ఆదేశించారు.
13న ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 7 గంటలకు రన్ ఫర్ శ్రీకాకుళం నిర్వహిస్తారు. నాగావళి హోటల్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహిస్తారు. కేఆర్ స్టేడియంలో మూడురోజుల పాటు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తారు.
14న మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. మెన్స్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం పోటీలు ఉంటాయి.
15న ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కెవి.మహేశ్వరరెడ్డి, ఆర్డీవో సాయి ప్రత్యూష పాల్గొన్నారు.