మూగబోయిన ఉద్దానం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:10 AM
Death of Maoist leader Mettur Joga Rao ఒకప్పుడు సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైన ఉద్దానం ప్రాంతం.. నేడు మూగబోయింది. ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది విప్లవకారులు ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. గతంలో ఎన్‌కౌంటర్ ఘటనల్లో కొందరు మావోయిస్టులు అమరులు కాగా.. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిశారు.
ఒకప్పుడు విప్లవోద్యమానికి మారుపేరు
మావోయిస్టు నేత మెట్టూరు జోగారావు మృతితో నిశ్శబ్ద వాతావరణం
ఇక మిగిలింది ఒక్కరే
పలాస/వజ్రపుకొత్తూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు సాయుధ విప్లవోద్యమం ప్రారంభమైన ఉద్దానం ప్రాంతం.. నేడు మూగబోయింది. ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది విప్లవకారులు ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యారు. గతంలో ఎన్‌కౌంటర్ ఘటనల్లో కొందరు మావోయిస్టులు అమరులు కాగా.. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిశారు. చివరిగా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు నేతలు చెల్లూరు నారాయణరావు, మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మాత్రమే మిగిలారు. వీరిద్దరిలో కూడా తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మెట్టూరు జోగారావు మృతి చెందారు. దీంతో విప్లవాల పురిటిగడ్డ ఉద్దానంలో చెల్లూరు నారాయణరావు ఒక్కరే మిగిలారు. ప్రస్తుతం జోగారావు మృతదేహం కోసం ప్రజాసంఘాల ప్రతినిధులు, అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులతోపాటు జోగారావు కుటుంబ సభ్యులు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వేచి చూస్తున్నారు. బాతుపురంతోపాటు ఉద్దానంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.
కమిటీలో వారిది ప్రత్యేక స్థానం
చెల్లూరు నారాయణరావు, మెట్టూరు జోగారావుల స్వగ్రామమైన బాతుపురం అంటే మావోయిస్టు పార్టీ నాయకత్వానికి ఎంతో మక్కువ. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ కమిటీలో వీరిది సముచితమైన స్థానం. జిల్లాకుచెందిన నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తరువాత వీరిద్దరికి మావోయిస్టు పార్టీలో కీలకబాధ్యతలు అప్పగించారు. హిడ్మా టీమ్‌లో వీరు చురుగ్గా ఉండేవారు. బాతుపురంలోని విప్లవోద్యమంలో వీరిద్దరిదీ ఒక్కో చరిత్ర. పీడిత ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతూ అనేక సమస్యలు పరిష్కరించారు. మెండు జీడితోటలు గిరిజనుల పరం చేయడం, అనేక కొండపోరంబోకు భూములను గిరిజనులకు పట్టాలు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, విద్యుత్‌దీపాలు, రహదారులు ఉద్దానం ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి సాయుధ విప్లవకారుల కృషి చరిత్రలో మిగిలిపోయింది.
బాతుపురానికి ఎంతో చరిత్ర
2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, చర్చలు ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మావోయిస్టులపై కొన్నాళ్లపాటు నిషేధాన్ని ఎత్తివేస్తూ.. వారిని చర్చలకు పిలిపించారు. అనంతరం మావోయిస్టులు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలకు చైతన్యం కల్పించారు. అందులో భాగంగా మొగిలిచర్లతో పాటు బాతుపురంలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించగా విప్లవకారుల ప్రతినిధులు వరవరరావు, కళ్యాణరావు, గద్దర్‌తో పాటు ప్రజాకవి వంగపండు ప్రసాదరావు తదితరులు తరలివచ్చారు. సభలో పాల్గొని తమ వాదనను ప్రజల్లో బలంగా వినిపించారు. అంతటి చరిత్ర బాతుపురానికి ఉంది.
గద్దర్ సభకు ఆకర్షితులై...
వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లి గ్రామం సముద్ర తీరంలో 1986లో విప్లవ నౌక గద్దర్ ‘గుండెచప్పుడు’ కార్యక్రమం పేరిట బహిరంగ సభ నిర్వహించారు. అర్ధరాత్రి జరిగిన ఈ సమావేశానికి శ్రీకాకుళం తీరప్రాంతంతోపాటు ఉద్దానం గ్రామాల ప్రజలంతా హాజరయ్యారు. ఈ క్రమంలో బాతుపురానికి చెందిన మెట్టూరు జోగారావు కూడా వచ్చారు. అక్కడ నుంచి అతనిలో విప్లవోద్యమం బయటకు వచ్చింది. ముందుగా కొరియర్‌గా మారాడు. జిల్లా అంతా అప్పటి పీపుల్స్‌వార్ పార్టీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ అక్కడ నుంచి అడవిబాట పట్టారు. ఇంటినుంచి బయటకువెళ్లిన జోగారావు మరి ఇక తిరిగి రాలేదు. ఆయన తరువాత చెల్లూరు నారాయణరావు కూడా విప్లవబాట పట్టారు. ఇద్దరూ ముందుగా పీపుల్స్‌వార్‌లోను, తరువాత మావోయిస్టు పార్టీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు. మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావుకు కుడిభుజంగా వీరిద్దరు పనిచేశారు. ఉద్దానంలో తిరిగిన సుధ దళం పిలుపుమేరకు జోగారావు అడవిబాట పట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అప్పట్లో జీడి గిట్టుబాటు ధర కోసం ఎక్కువ పోరాటాలు జరిగాయి. దీంతోపాటు గిరిజనులకు భూహక్కుల కోసం పోరాటం నడిచేది. ఈ రెండు ఉద్యమాల్లోనూ జోగారావు కీలకంగా పాల్గొని విజయం సాధించారు. అంచెలంచెలుగా ఎదిగి ఏవోబీ కమాండర్‌గాను, తర్వాత కీలకనేతకు కుడిభుజంగా ఎదిగి ఉమ్మది ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అనేక పోరుబాటల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1990 సంవత్సరం తరువాత చంద్రగిరిలో ఆయన అరెస్టు కాగా జైలులో 10 నెలలకు పైగా గడిపారు.
ఆయుధాల తయారీలో దిట్ట...
మెట్టూరు జోగారావు సాయుధపోరాటంలో చురుగ్గా పాల్గొనడంతోపాటు మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు, హిడ్మా టీములో ప్రధాన సభ్యుడు. ఆయుధాల తయారీలో ఎంతో నేర్పరి. తుపాకులు, రాకెట్ లాంఛర్లు తయారు చేయడంలో దిట్ట. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం ఉండడంతో ఈయనకు సాయుధబలగాలు టెక్(టెక్నికల్)గా పిలుచుకుంటారు. జోగారావుకు టెక్ శంకర్, శివ అనే మారు పేర్లు ఉన్నాయి.
కుటుంబ నేపథ్యం
జోగారావు తల్లిదండ్రులు చిన్నపిల్లమ్మ, కామయ్య రజక వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. 2021 సంవత్సరం మార్చిలో తండ్రి మృతి చెందగా.. ఈ ఏడాది జూలై 24న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మావోయిస్టు పార్టీ నిషేధం ఉన్న కారణంగా తల్లిదండ్రుల అంత్యక్రియలకు జోగారావు హాజరు కాలేకపోయారు. జోగారావు పెద్దన్నయ్య యువరాజు హైదరాబాద్‌లో ఉండగా, తమ్ముడు శ్యామ్ దుబాయ్‌లోను, మరో తమ్ముడు మధు విశాఖపట్నంలో ప్రైవేటు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అక్కాచెల్లెళ్లు శేషమ్మ, మోహినిలు ధర్మపురం, కుంటికోట గ్రామాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం బాతుపురంలోని జోగారావు నివాసంలో తమ్ముడు శ్యామ్ భార్య, పిల్లలు ఉన్నారు.