Srikakulam History : సిక్కోలు వజ్రోత్సవం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:59 PM
Diamond Jubilee celebrations begin today శ్రీకాకుళం అంటేనే అన్ని ప్రాంతాల సమాహారం. 193 కిలోమీటర్ల సుదీర్ఘ మైన తీరప్రాంతం... రూ.కోట్లలో విలువచేసే ఖనిజ సంపద... పచ్చని కొండలు.. సుదూరమైన జాతీయరహదారి.. ఇవన్నీ జిల్లాకు ఆభరణాలు. మరోవైపు పర్యాటక అందాలకు నెలవు సిక్కోలు.
ప్రతి అడుగులోనూ చైతన్యమే
పోరాటాలకు దిక్సూచి శ్రీకాకుళం
స్వాతంత్య్ర ఉద్యమంలోనూ కీలకం
రాజకీయంగా తనదైన ముద్ర
సిక్కోలు.. ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తి రగిల్చిన పోరాటాల పురిటిగెడ్డ. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ ప్రాంతం కీలకపాత్ర పోషించింది. గిరిజన రైతాంగ పోరాటంతో జాతీయస్థాయిలో కూడా ఉద్యమాల కేంద్రంగా గుర్తింపు పొందింది. మరోవైపు పచ్చని పంట పొలాలు, ప్రకృతి అందాలు, ఉప్పొంగే భక్తిభావం, విజ్ఞాన వికాసం సిక్కోలు సొంతం. ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ.. 75 ఏళ్ల కిందట ఇదేరోజు జిల్లాగా అవతరించిన శ్రీకాకుళం.. నేడు వజ్రోత్సవాలకు ముస్తాబైంది. బుధవారం నుంచి మూడురోజులపాటు వేడుకలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో జిల్లా ఆవిర్భావం, చరిత్ర, ప్రగతి గురించి కథనాలు..
...........
రణస్థలం/నరసన్నపేట, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం అంటేనే అన్ని ప్రాంతాల సమాహారం. 193 కిలోమీటర్ల సుదీర్ఘ మైన తీరప్రాంతం... రూ.కోట్లలో విలువచేసే ఖనిజ సంపద... పచ్చని కొండలు.. సుదూరమైన జాతీయరహదారి.. ఇవన్నీ జిల్లాకు ఆభరణాలు. మరోవైపు పర్యాటక అందాలకు నెలవు సిక్కోలు. ఇంకోవైపు అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఫరిడవిల్లుతున్నాయి. శాలిహుండం, దంతపురి, పాండవుల మెట్ట, జగతిమెట్టవంటి పర్యాటక ప్రాంతాలు ఇక్కడ నెలవు. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయా వంటి నదులు ప్రవహించే నేల ఇది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా పేరొందింది. స్వాతంత్ర సమరయోధులు, రాజకీయవేత్తలు, రంగస్థల కళాకారులు వంటి ఎందరో ప్రముఖులు జన్మించిన పుణ్యస్థలం. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సిక్కోలు ఏడున్నర దశాబ్దాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ.. అభివృద్ధి దిశగా పయనిస్తోంది.
జిల్లా ఆవిర్భావం ఇలా..
శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15న ఆవిర్భవించింది. అప్పటివరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌గా ఉండేది. తర్వాత 11 తాలుకాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. 1960లో ప్రస్తుత జిల్లా పరిషత్‌గా పిలిచే జిల్లా బోర్డు ఏర్పాటైంది. 1969లో జిల్లా విభజన జరిగింది. బొబ్బిలి, సాలూరు తాలుకాల్లోని 107 గ్రామాలను విభజించి గజపతినగరం తాలుకాగా ఏర్పాటు చేశారు. 1979లో సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం తాలుకాలు వేరుపడి.. విశాఖలో ఉన్న విజయనగరం తాలుకాతో కలిపి.. విజయనగరం జిల్లా ఏర్పాటైంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సమితి వ్యవస్థ రద్దయింది. వాటి స్థానంలో 37 మండలాలు ఏర్పాటయ్యాయి. 1999లో చివరిసారిగా సరుబుజ్జిలి మండలం నుంచి వేరుపడి 19 పంచాయతీలతో లక్మీనర్సుపేట మండలం ఏర్పాటైంది. 2022 ఏప్రిల్ 4న జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యంలో, రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో విలీనమైంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు మిగిలాయి. ప్రస్తుతం 30 మండలాలతో కొనసాగుతోంది.
నాయకుల పుట్టినిల్లు...
ఎందరో మహనీయులు జిల్లా నుంచి అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్‌కు తొలి చైర్మన్‌గా బెండి కూర్మన్న వ్యవహరించారు. జిల్లా తొలి కలెక్టర్‌గా షేక్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు. జిల్లా ఏర్పడిన తొలినాళ్లలో సర్దార్ గౌతు లచ్చన్న, బొడ్డేపల్లి రామ్మోహన్‌రావు, లుకలాపు లక్ష్మణదాస్, గొర్లె శ్రీరాములనాయుడు, మజ్జి తులసీదాస్, బగ్గు సరోజినీదేవి, పాలవలస రుక్మిణమ్మ వంటి నాయకులు రాజకీయాల్లో రాణించారు. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్రద్యోమంలో పాలుపంచుకున్నారు. 1952లో తొలిసారిగా కృషీకర్ లోక్‌పార్టీ తరుపున సోంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే బొడ్డేపల్లి రాజగోపాలరావు సుదీర్ఘకాలం శ్రీకాకుళం ఎంపీగా పదవి చేపట్టారు. 1952 నుంచి నిరంతరాయంగా గెలుస్తూ వచ్చారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. జిల్లాకు చెందిన మజ్జి తులసీదాస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. జిల్లాకు చెందిన కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ప్రాతినిఽథ్యం వహిస్తూ కేంద్రమంత్రి అయ్యారు. మరో మహిళా ఎంపీ కిల్లి కృపారాణి సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, గౌతు శివాజీ, గుండ అప్పలసూర్యనారాయణ వంటి నేతలు అమాత్యులుగా రాణించారు. తొలి మహిళా అసెంబ్లీ స్పీకర్‌గా కావలి ప్రతిభాభారతి అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. జిల్లాకు చెందిన రొక్కం లక్మీనరసింహం దొర, తంగి సత్యనారాయణ, ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాంలు ఏపీ అసెంబ్లీ స్పీకర్లయ్యారు. ఇలా జిల్లాకు చెందిన ఎంతోమంది నేతలు రాజకీయంగా రాణించారు.
అప్పట్లో చికాకోల్
నరసన్నపేట, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళాన్ని అప్పట్లో చికాకోల్ అని పిలిచేవారు. ఆ పేరును క్రమేపీ సిక్కోలుగా పలికేవారు. తూర్పు గంగరాజువంశం, నందపూర్ సూర్యవంశీయలు, గోల్కొండ కుతుబ్‌షాహీలు పాలించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీ.పూ. ఆరో శతాబ్దంలో ఆవిర్భవించిన బౌద్ధమతం.. శ్రీకాకుళంలో బాగా విస్తరించింది. ఆనాటి బౌద్ధ ఆరామాలే నేటి శాలిహుండం, దంతపురి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. తూర్పు కనుములు ప్రకృతి సోయగాలకు ప్రతీకగా నిలిచాయి. మందస, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, హిరమండలం, కొత్తూరు. సరుబుజ్జిలి, ఎల్.ఎన్.పేట తదితర మండలాల్లో తూర్పుకనుమలు విస్తరించి ఉన్నాయి.
జిల్లాలో బీల ప్రాంతం, ఉద్దానం.. ఒండ్రు నేలలతో కూడి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పలు ఆహార, వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయి. ఉద్దానం కొబ్బరి, జీడిమామిడి, పనస, ములగ, మైదానం ప్రాంతంలో వరి, అపరాలు, వేరుశెనగ, మొక్కజొన్న వంటి పంటలు పుష్కలంగా పండుతాయి. జిల్లాలో ఏటా సుమారు 5.5 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తారు.
సాహితీవేత్తలెందరో..
జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలుగా గుర్తింపు పొందారు. వ్యవహారిక భాష పితాముహుడు - గిడుగు రామమూర్తి పంతులు, కవి, స్వాతంత్ర సమరయోధుడు - గరిమెళ్ల సత్యనారాయణ, కథారచయిత - కాళిపట్నం రామారావు, నాటక రచయిత, కవి, కథకులు, కేంద్రసంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత దీర్ఘాశి విజయభాస్కర్, సాహితీ వేత్త, రచయిత - రాచకొండ విశ్వనాథశాసి్త్ర, రచయితలు - పింగళి నాగేంద్రరావు, వాండ్రంగి రామారావు, అట్టాడ అప్పలనాయుడు, బలివాడ కాంతారావు, సాహితీ పరిశోధకులు ఛాయరాజ్, దూసి ధర్మారావు తదితరులు జిల్లాకు చెందిన వారే. శ్రీపాద పినాకపాణి, వడ్డాది పాపయ్య, జె.వి.సోమయాజులు, చట్టి పూర్ణయ్య పంతులు, అమరాపు సత్యనారాయణ, యడ్ల గోపాలరావు, దూసి బెనర్జీ భాగవతార్, లోకనాథం నందికేశ్వరరావు, జి.ఆనంద్, గజల్ శ్రీనివాస్, పి.సుశీల, రావి కొండలరావు, శరత్‌బాబు వంటి కళాకారులు మన జిల్లావారే. కోడి రామమూర్తి, కరణం మల్లేశ్వరి, పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మీ వంటి క్రీడాకారులు జిల్లాకు చెందిన వారే. వీర గున్నమ్ము, చౌదరి సత్యనారాయణ, గౌతు లచ్చన్న, పొట్నూరు స్వామిబాబు, బంకుపల్లి మల్లయ్యశాస్త్రి వంటి సంఘ సంస్కర్తలు మన జిల్లావాసులు కావడం గర్వకారణం.
నేటి నుంచి వేడుకలు
శ్రీకాకుళంలో జిల్లా ఆవిర్భావ వజ్రోత్సవ వేడుకలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడురోజులపాటు జరగనున్న ఈ వేడుకులకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
13న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 7 గంటలకు రన్ ఫర్ శ్రీకాకుళం ర్యాలీ ప్రారంభిస్తారు. నాగావళి హోటల్‌లో ఉదయం 11 గంటలకు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహిస్తారు. కేఆర్ స్టేడియంలో మూడురోజుల పాటు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వర్ణ శ్రీకాకుళం ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తారు.
14న ఏడురోడ్ల జంక్షన్‌లోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం పోటీలు ఉంటాయి.
15న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కేఆర్ స్టేడియంలో జిల్లాకు చెందిన ప్రముఖలను సన్మానిస్తారు. ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనున్నారు.