Share News

అమ్మో.. ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:23 AM

‘Sickle Cell Anemia cases improved అరుదైన జన్యుపర రక్త సంబంధిత వ్యాధి.. ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’ ప్రస్తుతం ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఆరోగ్యశాఖ సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి నమోదులో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.

అమ్మో.. ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’

ఏజెన్సీలో పెరుగుతున్న రోగుల సంఖ్య

రాష్ట్రంలోనే సిక్కోలుకు మూడో స్థానం

జిల్లాలో 859 మంది క్యారియర్లు..

189 పాజిటివ్‌ కేసులు నమోదు

శ్రీకాకుళం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అరుదైన జన్యుపర రక్త సంబంధిత వ్యాధి.. ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’ ప్రస్తుతం ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఆరోగ్యశాఖ సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యాధి నమోదులో శ్రీకాకుళం జిల్లా మూడో స్థానంలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోనే ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 859 మంది సికెల్‌ సెల్‌ క్యారియర్లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. 189 మంది సికెల్‌ సెల్‌ ఎనీమియా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మెళియాపుట్టి, మందస, కొత్తూరు, హిరమండలం, మెట్టూరు, సిరిపురం, బుడంబోకాలనీ, హరిపురం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’ కేసులు బయటపడుతున్నాయి. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ‘సికెల్‌ సెల్‌ ఎనీమియా’ ప్రభావిత ప్రాంతాల్లో నలభై ఏళ్లలోపున్న వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.

లక్షణాలివీ..

ఈ వ్యాధి ప్రధానంగా ఒక తరం నుంచి మరో తరానికి జన్యుపరంగా వస్తుంది. అలజడి జీవనశైలి, అవగాహన లేకపోవడం, గ్రామీణ-గిరిజన ప్రాంతాల్లో ముందస్తు స్ర్కీనింగ్‌ లోపం.. ఇవన్నీ కలిసి ప్రభావం చూపుతున్నాయి. ఈ వ్యాధిసోకిన వారికి రక్తంలోని ఎర్రరక్త పదార్థాలు(ఆర్‌బీసీ) సాధారణంగా.. గుండ్రంగా ఉండకుండా.. సికెల్‌(పెంకు ఆకారంలో)గా మారుతాయి. దీంతో రక్త ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటుంది. ఆక్సిజన్‌ సరపరా తగ్గిపోతుంది. దీనివల్ల రోగికి తీవ్రమైన రక్తహీనత, శ్వాసలో ఇబ్బంది, ఎముకలు, కండరాలలో తీవ్రమైన నొప్పులు, అవయవ నష్టమయ్యే అవకాశం, పొట్ట ప్రాంతంలో నొప్పి.. నీరసం, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురవుతాయి. సాధారణంగా ప్రారంభ దశలో దీనిని గుర్తించడంలో చాలామంది విఫలమవుతున్నారు. చికిత్సకు సమయం పట్టడం, ఖర్చు భారంగా ఉండటం.. వంటి సమస్యలూ ఉన్నాయి.

వైద్యులు ఏమంటున్నారంటే...?

వైద్య ఆరోగ్యశాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వివాహానికి ముందు జెనెటిక్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరిగా చేయాలి. క్యారియర్‌లైన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే.. వారికి పుట్టే పిల్లల్లో రిస్క్‌ చాలా ఎక్కువ. ఇప్పటికే ఈ వ్యాధితో ఉన్న వారికి వైద్యపరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సికెల్‌ సెల్‌ ఎనీమియా రోగులకు ప్రభుత్వం రూ.10వేలు చొప్పున పింఛన్‌ కూడా చెల్లిస్తోంది. ఒక తరం నుంచి మరో తరానికి సికెల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి సంక్రమించకుండా జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశాలను.. అలాగే తొలితరం క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలు జరగకుండా చేయాలి. గ్రామీణ.. గిరిజన ప్రాంతాల్లో భారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గిరిజన ప్రాంతాల్లో నిరంతర స్ర్కీనింగ్‌ డ్రైవ్‌లు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో పరీక్షలు.. కౌన్సెలింగ్‌ చేయాలి. క్యారియర్‌ ఉన్న వారు వైద్య పర్యవేక్షణలో ఉండటం మంచిది. జిల్లాలో ఇప్పుడు తీసుకునే చర్యలే.. రాబోయే పదేళ్ల ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గించగలవని వైద్యులు చెబుతున్నారు.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం

హిరమండలం, కొత్తూరు, మందస.. సీతంపేట తదితర మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లోనూ సికెల్‌ సెల్‌ ఎనీమియా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ రోగులకు రక్తమార్పిడి జరిగేలా వైద్యసదుపాయం కూడా కల్పించాం. కొత్తగా గుర్తించిన కేసులకు పింఛన్లు మంజూరయ్యేలా ప్రతిపాదన సిద్ధం చేశాం. గిరిజన ప్రాంతాల్లో జన్యుపరంగా ఈ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- డా.మేరీ కేథరీన్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - Nov 11 , 2025 | 12:23 AM