Shutters Damaged: లోగయి.. నీరేదీ?
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:12 AM
Dam shutters broken దశాబ్దాల కిందట రాజుల కాలంలో మందస మండలం గోవిందపురం వద్ద సునాముది గెడ్డపై నిర్మించిన లోగయి ఆనకట్ట శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులకు నోచుకోక.. నీరు నిలువక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
షట్టర్లు విరిగి.. చుక్కనీరు నిలువక
కరువు కోరల్లో శివారు ఆయకట్టు
రూపుకోల్పోతున్న ఆనకట్ట
కూటమి ప్రభుత్వం పైనే రైతుల ఆశలు
దశాబ్దాల కిందట రాజుల కాలంలో మందస మండలం గోవిందపురం వద్ద సునాముది గెడ్డపై నిర్మించిన లోగయి ఆనకట్ట శిథిలావస్థకు చేరుకుంది. మరమ్మతులకు నోచుకోక.. నీరు నిలువక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. లోగయి ఆనకట్ట వద్ద నిర్మించిన ఎడమ కాలువ మదుము షట్టర్లు పాడవటంతో వర్షాల సమయంలో పొలాల్లో పంటలు ముంపునకు గురవుతున్నాయి. ఆనకట్ట కుడికాలువ మరమ్మతులకు నోచుకోక ఇసుక మేటలు, ముళ్లపొదలతో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
.................
హరిపురం, జూలై 17(ఆంధ్రజ్యోతి): మందస మండలంలో సునాముది గెడ్డపై రాజుల కాలంలో నిర్మించిన లోగయి ఆనకట్ట.. శిథిలావస్థకు చేరడంతో రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మందస మండలం గోవిందపురం, కొత్తపల్లి, వీవీఆర్‌పురం, టీశాసనాం, ముకుందపురం, సోంపేట మండలం అనంతపురం, మూలూరు, గొల్లూరు వంటి సుమారు 15గ్రామాల్లో అన్నదాతలకు ఇదే ప్రధాన సాగు నీటి వనరు. దాదాపు 6,500 ఎకరాలకు లోగయి ఆనకట్ట ద్వారా పుష్కలంగా రెండు పంటలకు సాగునీరు అందేది. ఈ ఆనకట్టను సుమారు 500 మీటర్లు పొడవుతో, నాలుగు భాగాలుగా విభజించి నిర్మించారు. కాగా గత పదేళ్లుగా ఎలాంటి మరమ్మత్తులకు నోచుకోక.. ఆనకట్టలు శిథిలమై నీరు కారి చుక్క నీరు నీలువ ఉండని దుస్థితి నెలకొంది. కాలువలు వెంబడి నీరు ప్రవహించేదుకు ఏర్పాటు చేసిన షట్టర్లు సైతం తుప్పు పట్టాయి. దీంతో ఆయా కాలువల్లో నీరు ప్రవహించక.. వేలాది ఎకరాల శివారు ఆయకట్టు భూములు నీరందక ఏళ్లుగా కరవు కోరల్లో చిక్కుకుంటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటితీరువా చెల్లిస్తున్నా.. ఆనకట్ట మరమ్మతులకు నిధులు మంజూరు చేయడం లేదని వాపోతున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.9లక్షలు మంజూరు కాగా.. తూతూమంత్రంగా పనులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు విదల్చలేదు. దీంతో కాలువలు అధ్వానంగా తయారై.. సిమెంటు కట్టడాలు విరిగి చుక్క నీరు నిలవటం గగనమైంది. కూటమి ప్రభుత్వమైనా స్పందించి లోగయి ఆనకట్ట మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రైతులకు తీవ్ర ఇబ్బందులు
షట్టర్లు విరిగిపోయి నీరు ప్రవహించక నీరు వృథాగా పోతోంది. ఆయా మదుములు, తూముల వద్ద ఇసుక బస్తాలు నింపి అడ్డగా వేస్తున్నాం. నీటి ప్రవాహం ఎక్కువైతే ఆనకట్టలో దిగేందుకు సాహసం చేయాల్సిందే. రైతులు తీవ్ర ఇబ్బందులు నడుమ సాగు చేస్తున్నారు.
బి.వల్లభరావు, ఆయకట్టు రైతు, గోవిందపురం
షట్టర్లు మార్చాలి
ప్రభుత్వం తక్షణమే స్పందిచి లోగయి ఆనకట్టు మదుములకు పూర్తిస్థాయిలో కొత్త షట్టర్లు ఏర్పాటు చేయాలి. మరమ్మతులు చేపట్టి ఆయకట్టు రైతులను ఆదుకోవాలి.
- బాడ జగన్నాయకులు, మాజీ సర్పంచ్, ఆయకట్టు రైతు
నిధులు మంజూరైతే..
లోగయి సాగునీటివనరును ఇప్పటికే పరిశీలించాం. అంచనాలు తయారుచేసి అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. రూ.కోట్లలో నిధులు అవసరం కావడంతో ఎమ్మెల్యే శిరీష దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస