Share News

Online cheating : ఆశ చూపి.. మోసం చేసి..

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:26 PM

Online gaming victims increasing in the district జిల్లాలో ఆన్‌లైన్‌ గేమ్స్‌, రుణయాప్‌ల బాధితులు పెరుగుతున్నారు. సెల్‌ఫోన్‌ ఓపెన్‌ చేస్తేచాలు.. వన్‌ ఎక్స్‌బెట్‌, మెగాపరి, మోస్ట్‌బెట్‌, పరిపేస, పరిమ్యాచ్‌, 10సీఆర్‌ఐసి, మెల్‌బెట్‌, మేట్‌బెట్‌, 1 ఎక్స్‌బెట్‌, బీసీ డాట్‌గేమ్‌, 22 బెట్స్‌, రాజా బెట్స్‌, స్టేక్‌ డాట్‌కమ్‌, డఫ్ఫాబెట్‌ వంటి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కనిపిస్తుంటాయి.

Online cheating : ఆశ చూపి.. మోసం చేసి..

  • జిల్లాలో పెరుగుతున్న ఆన్‌లైన్‌ గేమ్స్‌ బాధితులు

  • రుణయాప్‌లకు ఆకర్షితులై నష్టపోతున్న వైనం

  • ఒత్తిడి, వేధింపులు భరించలేక ఆత్మహత్యలు

  • రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడి ఇటీవల రూ.11.50 లక్షలు పోగొట్టుకున్నాడు. బంధువులు, స్నేహితులు వద్ద అప్పు చేసి మరీ ఆన్‌లైన్‌లో ఆటలు ఆడాడు. చివరకు మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.

  • గత నెలలో హిరమండలం మండలం గులుమూరుకు చెందిన మజ్జి బుజ్జి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడే అలావాటు ఉన్న బుజ్జి బంధువులు, మిత్రులు వద్ద అప్పులు చేశాడు. అప్పు తీర్చకపోవడంతో వారి నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుజ్జి మరణంతో భార్య, కుమారుడు, తల్లిదండ్రులు వీధిన పడ్డారు.

  • శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువతికి గరివిడికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగితో ఆరు నెలల కిందట వివాహమైంది. ఉద్యోగరీత్యా వీరు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి.. ఆన్‌లైన్‌ గేమ్‌లకు, బెట్టింగ్‌లకు అలవాటు పడి తన జీతంతోపాటు భార్య జీతాన్ని కూడా ఈఎంఐలకు ఎండార్స్‌ చేశారు. ఇంకా ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం ద్వారా మరింత డబ్బు సంపాదించవచ్చునని భార్యకు మరికొంత డబ్బును కన్నవారింటి నుంచి తీసుకొని రావాలని వేధించాడు. ఈ విషయం కన్నవారికి తెలిసి.. ఆమెను శ్రీకాకుళం తీసుకువచ్చేశారు. గత నెలలో శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులకు భర్తపై ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈ నెల 12న ఆ బ్యాంకు ఉద్యోగిపై టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు.

  • శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆన్‌లైన్‌ గేమ్స్‌, రుణయాప్‌ల బాధితులు పెరుగుతున్నారు. సెల్‌ఫోన్‌ ఓపెన్‌ చేస్తేచాలు.. వన్‌ ఎక్స్‌బెట్‌, మెగాపరి, మోస్ట్‌బెట్‌, పరిపేస, పరిమ్యాచ్‌, 10సీఆర్‌ఐసి, మెల్‌బెట్‌, మేట్‌బెట్‌, 1 ఎక్స్‌బెట్‌, బీసీ డాట్‌గేమ్‌, 22 బెట్స్‌, రాజా బెట్స్‌, స్టేక్‌ డాట్‌కమ్‌, డఫ్ఫాబెట్‌ వంటి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కనిపిస్తుంటాయి. యూట్యూబ్‌, సోషల్‌మీడియా, పలు వెబ్‌సైట్లలో రూ.వంద పెడితే రూ.వెయ్యి ఇస్తామంటూ బెట్టింగ్‌ యాప్స్‌ యాడ్స్‌ దర్శనమిస్తున్నాయి. చేపకు గాలం వేసినట్టు కొత్త కస్టమర్లకు మొదట్లో రూ.వందకు రూ.200, రూ.వెయ్యికు, రూ.రెండువేలు, రూ.మూడువేలు ఇస్తూ మెల్లగా ఊబిలోకి లాగుతున్నారు. ప్రస్తుతం యువత పగలు, రాత్రీ తేడా లేకుండా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్స్‌లో మునిగి తేలుతున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, బ్యాంకర్లు సైతం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడుతున్నారు. చాలామంది ఈ బెట్టింగ్‌ల్లో నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు.

  • రుణాల పేరిట అలా ఉచ్చులో...

  • ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఎటువంటి డాక్యుమెంట్లు, ష్యూరిటీలు లేకుండానే.. యాప్‌ ద్వారా క్షణాల్లో మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఆశ పెడుతున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు అవసరాల కోసం వీటి ఉచ్చులో పడుతున్నారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వారికి రుణాల మంజూరు చేస్తూ.. ఫోన్‌లో కాంటాక్ట్‌ నెంబర్ల డేటా సైతం సేకరిస్తున్నారు. కాగా.. రుణం ఇచ్చిన వారం, పది రోజుల వ్యవధికే అధిక వడ్డీ కట్టాలంటూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. రూ.7వేలు తీసుకున్న వ్యక్తికి కేవలం 15 రోజుల్లోనే రూ.10వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రుణం చెల్లించడం ఆలస్యమైతే రెండింతల వడ్డీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది అంత వడ్డీ చెల్లించకపోవడంతో వారి ఫోన్‌లో ఉన్న కాంట్రాక్ట్‌ నెంబర్లకు ఫోన్‌లు, మెసేజ్‌లు పంపిస్తూ భయపెడుతున్నారు. దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారు. దీంతో ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ జిల్లాలో ఉన్నాయి. యువత, ఉద్యోగులు ఆన్‌లైన్‌ గేమ్స్‌, రుణాల బారిన పడకుండా పోలీసులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌ గేమ్‌ల నియంత్రణపై కఠినచర్యలు చేపడుతూ ఇటీవల పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లు ప్రతిపాదించారు. చట్టాలు అమలైతే ఆన్‌లైన్‌ గేమ్‌లో ఎంతవరకు నియం త్రించవచ్చునని వేచి చూడాలి.

  • చాలా జాగ్రత్తగా ఉండాలి

  • ఆన్‌లైన్‌ గేమ్స్‌, రుణ యాప్‌లతో చాలా జా గ్రత్తగా ఉండాలి. లేనిపోని లింకులు క్లిక్‌ చేయకూడదు. ఒకసారి అటువంటివి క్లిక్‌ చేస్తే అదేపనిగా సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. రుణాల పేరుతో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఎవరికైనా ఆర్థిక సమస్యలుంటే కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ రుణయాప్‌లను సం ప్రదించకూడదు.

  • - వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళంటౌన్‌

Updated Date - Aug 29 , 2025 | 11:26 PM