crime news: ఆమెది హత్యే
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:16 AM
The mystery of the mysterious death that has been left ఆమదాలవలస పట్టణం చంద్రయ్యపేటలో గత నెల 30న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
వీడిన అనుమానాస్పద మృతి మిస్టరీ
యువకుడి అరెస్టు
ఆమదాలవలస, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పట్టణం చంద్రయ్యపేటలో గత నెల 30న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్టు నిర్ధారించారు. నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ(45) హత్య కేసులో సరుబుజ్జిలి గ్రామ పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్ అనే యువకుడిని అరెస్టు చేశాం. నవీన్ తరచూ అమ్మాయిలను రమణమ్మ ఇంటికి తీసుకొచ్చి జల్సాలు చేసేవాడు. ఈక్రమంలో గతనెల 30న తన కోరిక తీర్చమని నవీన్.. రమణమ్మను అడగ్గా ఆమె అంగీకరించలేదు. దీంతో గతంలో తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని నవీన్ డిమాండ్ చేశాడు. డబ్బులు ఇప్పుడు లేవని చెప్పడంతో ఆగ్రహంతో రమణమ్మ ముఖంపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా గొంతు నులిపేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత ఆమె ఇంట్లో ఉన్న 98గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు రూ.20 వేల నగదుతో అక్కడి నుంచి నవీన్ ఉడాయించాడు. వాటిని తన ఇంట్లో దాచుకున్నాడు. కొంత బంగారాన్ని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో తనఖా పెట్టి.. తీసుకున్న డబ్బుతో మళ్లీ జల్సాలు సాగించాడు. కాగా.. ఇంట్లో తన భార్య విగతజీవిగా పడి ఉందని.. బంగారం, వెండి, నగదు మాయమయ్యాయని రమణమ్మ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేశాము. రిమ్స్‌లో మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఇది సహజ మరణం కాదని తేల్చారు. ఎవరో బలంగా ఊపిరి ఆడకుండా చేయడంతో మృతి చెందినట్టు ధ్రువీకరించారు. దీనిపై సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ ఎస్.బాలరాజు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెకు ఆ రోజు వచ్చిన కాల్ లిస్టులో నవీన్ పేరు ఉండగా ఆరా తీశారు. చంద్రయ్యపేటవీధిలో నవీన్ తరచూ తిరుగుతుండే వాడని తెలుసుకున్నారు. వారు నవీన్‌ను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకుని నవీన్ సరుబుజ్జిలి గ్రామ రెవెన్యూ అధికారి వద్ద తన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. నవీన్ అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి.. అనంతరం రిమాండ్‌కు తరలించాం. బంగారం, వెండి, నగదును సీజ్ చేశామ’ని డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.