Share News

శంభో శంకర

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:36 AM

Devotees flock to Shiva temples కార్తీకమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఓ వైపు మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచీ వర్షాలు కురుస్తూనే ఉన్నా.. ఆలయాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుని పూజలు చేశారు.

శంభో శంకర
శ్రీముఖలింగంలో భక్తుల రద్దీ

సందడిగా కార్తీకమాస తొలి సోమవారం

వర్షంలోనూ శివాలయాలకు పోటెత్తిన భక్తులు

ఆలయాల్లో పూజలు, దీపారాధనలు

అరసవల్లి/ టెక్కలి రూరల్‌/ జలుమూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఓ వైపు మొంథా తుఫాన్‌ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచీ వర్షాలు కురుస్తూనే ఉన్నా.. ఆలయాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుని పూజలు చేశారు. దీపాలు వెలిగించారు. శ్రీకాకుళంలోని ఉమారుద్రకోటేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంతోపాటు టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లన్న ఆలయంలో శివనామస్మరణ మార్మోగింది. ఇలా జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ సోమవారం వేకువజాము నుంచే భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీకాకుళంలోని ఉమారుద్రకోటేశ్వరాలయంలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభమయ్యాయి. నాగావళి నదిలో కొంతమంది భక్తులు స్నానాలు ఆచరించారు. నది ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించారు. ఘాట్‌ వద్ద అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. అలాగే నక్కవీధిలోని శ్రీఉమాజఠలేశ్వరస్వామి, కలెక్టర్‌ బంగ్లారోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.

శ్రీముఖలింగంలో మధుకేశ్వరస్వామితోపాటు భీమేశ్వర, సోమేశ్వరాలయాలను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. తుఫాన్‌ కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. వారికి అసౌకర్యం కలుగకుండా ఈవో ఏడుకొండలు చర్యలు చేపట్టారు. అచ్యుతాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి పూజారి సుజాత అధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలో జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు గట్టి బందోబస్తు చేపట్టారు.

రావివలసలో ఎండలమల్లన్న ఆలయానికి టెక్కలి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. దేవదాయశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Oct 28 , 2025 | 12:36 AM