మొరాయిస్తున్న సర్వర్
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:57 PM
Problems for selling grain ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజుల నుంచి ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
ధాన్యం విక్రయించేందుకు అవస్థలు
కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు
సరిపడా జీపీఎస్ వాహనాలు లేక ఇక్కట్లు
ట్రక్‌షీటు కోసం రైతుల అగచాట్లు
నరసన్నపేట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజుల నుంచి ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో కళ్లాల్లో ధాన్యం తడిసి పోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలలోని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. సుమారు 60 శాతం మేర కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సాంకేతిక సిబ్బంది, డేటా ఆపరేటర్లను ఒప్పంద ప్రాతిపాదికన నియమించింది. సివిల్‌సప్లయ్ శాఖకు చెందిన ప్రత్యేక యాప్ ద్వారా ధాన్యం కొనుగోలు పక్రియ చేపడుతోంది. రైతులు ధాన్యంను విక్రయించేందుకు ఈ-క్రాప్ నమోదు ఆధారంగా షెడ్యూల్ తీసుకోవాలి. తర్వాత సాంకేతిక సిబ్బంది కళ్లాలకు వచ్చి ధాన్యం దిగుబడి, తేమ శాతం పరిశీలిస్తారు. నిబంధనలు మేరకు ఉంటే డేటా ఆపరేటర్ వద్దకు రైతు వెళ్లి తనకు ఇష్టం వచ్చిన మిల్లుకు ధాన్యం ఇచ్చేందుకు ట్రక్కు షీటు తీసుకోవాలి. ఈ సమయంలో జీపీఎస్ కలిగి ఉన్న వాహనం నెంబరు మాత్రమే నమోదు చేయాలి. తరువాత రైతులు కోరుకున్న మిల్లుకు ఎన్ని ధాన్యం ఇస్తున్నారో.. వివరాలతో నెంబరుతో ట్రక్కు షీటు జనరేట్ అవుతుంది. అప్పుడు రైతు.. ఆ ధాన్యాన్ని ట్రక్కు షీటులో నమోదు చేసిన జీపీఎస్ అనుసంధానమైన వాహనంతో మాత్రమే మిల్లుకు పంపించి కస్టోడియన్ అధికారికి అప్పగించాలి. కస్టోడియన్ అధికారి మిల్లు వద్ద ధాన్యం నాణ్యత పరిశీలించి.. మిల్లరుకు అప్పగిస్తారు. మిల్లరు ధాన్యం చేరినట్లు తన లాగిన్‌లో నమోదు చేస్తారు. అప్పుడు ప్రభుత్వం రైతు ఖాతాలో ధాన్యం సొమ్మును జమ చేస్తుంది. కాగా ఈ విధానంలో పలు సమస్యలు కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
సమస్యలివీ..
కొందరు రైతులు పంట పండించే సమయంలో ఈ-కైవైసీ చేయించుకోలేదు. రైతులకు షెడ్యూల్ ఇచ్చే వ్యవసాయశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో రైతు సేవాకేంద్రాల్లో ఉండడం లేదు.
జీపీఎస్ వాహనాలు రైతులకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు పండించే ధాన్యం మిల్లులకు తరలించేందుకు చిన్నవాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయలేదు. ఒక్కసారి ట్రక్కుషీటు జనరేటర్ అయిన తరువాత ఆ వాహనం అన్‌లోడింగ్ చేసిన తరువాత మాత్రం వెబ్‌సైట్‌లో కనిపించడంతో జాప్యం జరుగుతోంది.
శాంపిల్స్ తీసుకోవడంలో సాంకేతిక సిబ్బంది జాప్యం చేస్తున్నారు. మిల్లుకు చేరిన తరువాత మిల్లర్లు అదనంగా రెండు, మూడు కేజీల ధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేయడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.
రెండు రోజులుగా ధాన్యం కొనుగోలుకు వినియోగించే యాప్ మొరాయించింది. ట్రక్కు షీటు జనరేట్ చేసుకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. దీంతో కళ్లాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు పక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు వేగవంతం చేయాలి
రెండు రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. షెడ్యూల్ తీసుకున్న వారం రోజుల్లో ధాన్యం పంపించకుంటే షెడ్యూల్ రద్దవుతుంది. రీ షెడ్యూల్ చేసుకోవాలి. ట్రక్కు షీటు జనరేట్ చేయించుకునేందుకు గ్రామాల్లో జీపీఎస్ కలిగిన సరిపడే వాహనాలు లేవు. రైతులు ఇబ్బందులను గుర్తించి కొనుగోలు వేగవంతం చేయాలి.
- పోగోటి వెంకటరావు, కరగాం
సాంకేతిక సమస్య ఏర్పడింది
రెండు రోజులగా సర్వర్ డౌన్ అవ్వడం వాస్తవమే. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాంకేతిక సమస్యతో సర్వర్ యాప్ పనిచేయలేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు కొన్ని మార్పులు.. స్పీడు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.
- వేణుగోపాలరావు, డీఎం, సివిల్ సప్లయ్