Serious road accident: దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:20 AM
Serious road accident: వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. అంతా కలిసి ఆటోలో దైవ దర్శనానికి బయలుదేరారు.
- అచ్చుతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ఇద్దరు మహిళల దుర్మరణం
- 11 మందికి గాయాలు
-ఒకరి పరిస్థితి విషమం
-గుర్రాలపాలెంలో విషాదం
జలుమూరు/లావేరు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు. అంతా కలిసి ఆటోలో దైవ దర్శనానికి బయలుదేరారు. తొలుత ఓ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడ నుంచి మరో ఆలయానికి వెళ్తుండగా మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యారు. వారి ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. లావేరు మండలం గుర్రాలపాలెంకు చెందిన గట్టెం అచ్చియ్యమ్మ (52) గట్టెం పద్మ (25)తో పాటు మరో 11 మంది బుధవారం ఉదయం 9 గంటలకు ఆటోలో టెక్కలి మండలం రావివలస వెళ్లి ఎండలమల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుండగా జలుమూరు మండలం అచ్యుతాపురం వద్ద ఎదురుగా వస్తున్న బొలోరా వ్యాను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో అచ్చియ్యమ్మ, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిలో సిర్ర ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల పాప రుత్విక స్వల్ప గాయాలతో బయటపడింది. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, జలుమూరు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను అచ్యుతాపురం పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తహసీల్దార్ జె.రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బుధవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఒకే గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రమాదానికి గురవడంతో గుర్రాలపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతి చెందిన గట్టెం పద్మావతికి భర్త అప్పలరాజు, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గట్టెం అచ్చాయమ్మకు భర్త నాగరాజు, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.
క్షతగాత్రులు వీరే..
పెద్ది రుత్విక (3), పెద్ది అశ్వని (28) గట్టెం పద్మ (45), సిర్ర వరలక్ష్మి (30), సిర్ర ప్రకాష్ (40), బాద హేమలత (25), గట్టెం అప్పలనరసమ్మ (48), బాద మధుసూదనరావు, డ్రైవర్ (34), బాద రమణమ్మ (60), గట్టెం సుమతి (45) ఉన్నారు.

అచ్చియ్యమ్మ (ఫైల్) , పద్మ (ఫైల్)