Seeds Distributed: విత్తనాలు సత్వరమే పంపిణీ చేయాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:06 AM
Agriculture Crop Season ఖరీఫ్ సీజన్ వేళ.. రైతులకు సత్వరమే విత్తనాలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎరువులు సిద్ధంగా ఉంచాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ వేళ.. రైతులకు సత్వరమే విత్తనాలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘రైతులకు విత్తనాల సమస్య రాకూడదు. ఎరువులు కూడా సిద్ధం చేయాలి. డ్రోన్లను అందుబాటులో ఉంచాలి. గత ఏడాది ఎన్ని మండలాల్లో డ్రోన్లను వినియోగించారో వివరాలు అందించండి. శ్రీకాకుళం, గార మండలాల్లో ఏరియా యాక్షన్ ప్లాన్, గతేడాది పంటల వివరాలు రైతులను అడిగి తెలుసుకోవాల’ని ఆదేశించారు. అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించి.. వారం రోజుల్లో వివరాలు అందజేయాలని స్పష్టం చేశారు.
వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి మాట్లాడుతూ ‘ఖరీఫ్‌లో వరి 33,622 క్వింటాళ్ల విత్తనాలు, పచ్చిరొట్ట 1520 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 1000 పచ్చిరొట్ట విత్తన కిట్లు అందజేశాం. యూరియా, డీఏపీ, తదితర ఎరువులకు సంబంధించి 69.05 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం జిల్లాలో 13,495 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతుసేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. మండలాల నుంచి 2,500 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని ప్రతిపాదనలు వచ్చాయి. జిల్లాకు 38 రైతు డ్రోన్‌ల ఎఫ్‌ఎంబీలు లక్ష్యం కాగా, 31 సీహెచ్‌సీ గ్రూపులకు అనుమతులు మంజూరయ్యాయి. ప్రతీ డ్రోన్ గ్రూప్‌నకు 80శాతం సబ్సిడీ వర్తిస్తుంది. పొలం పిలుస్తోంది కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించాం. సజ్జలు, మొక్కజొన్న, రాగి, అపరాలు, వేరుశనగ, నువ్వులు, పత్తి, గోగునార, చెరకు రైతులకు పంపిణీ చేశామ’ని తెలిపారు. అలాగే ఏపీఎంఐసీ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పంటల వివరాలను కలెక్టర్‌కు తెలియజేశారు.
పశు సంవర్థక శాఖ జేడీ కె.రాజగోపాల్ మాట్లాడుతూ ‘డీ-వార్మింగ్ జరుగుతోంది. ఉచితంగానే వ్యాక్సినేషన్ వేస్తున్నాం. 82శాతం గోకులాలను పూర్తి చేశామ’ని తెలిపారు. మిగిలిన గోకులాలను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ మాట్లాడుతూ ‘జిల్లాలో 15,584 మంది మత్స్యకారులకు మత్స్యకారసేవ అందించాం. శ్రీకాకుళం మండలం పెద్ద గణగళ్లవానిపేట, కవిటి మండలం ఇద్దువానిపాలెం, వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామాల్లో భవన నిర్మాణాలను చేపడుతున్నాం. ఐదు మండలాల్లో నాన్-అక్వాకల్చర్ జోన్ ఏరియా 230.82 ఎకరాలు ఉండగా, దానిని ఆక్వాకల్చర్ జోన్‌గా అభివృద్ధి చేశాం. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన కింద ఇప్పటికే 13 కో-ఆపరేటివ్ సొసైటీలు అఫ్రూవల్ జరిగింది. సముద్రపు నాచు సాగుకు భావనపాడు, బారువ వద్ద ప్రదేశాలను గుర్తించాం. ప్రతీ ప్రదేశం నుంచి 30 మందికి ఈ నెల 4 నుండి 9 వరకు శిక్షణ ఇస్తామ’ని తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీలు పాల్గొన్నారు.