Secretariat: ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:23 AM
Secretariat: సచివాలయాల్లో కొందరు ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. సమయపాలన పాటించడం లేదు.
- ఇదీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిస్థితి
- పూర్తిస్థాయిలో హాజరుకాని ఉద్యోగులు
- సమయపాలన పాటించడం అంతంతే
- కానరాని అధికారుల పర్యవేక్షణ
- పింఛన్ పంపిణీ సమయంలోనే హడావుడి
- జిల్లాలో సుమారు 700 పోస్టులు ఖాళీ
శ్రీకాకుళం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సచివాలయాల్లో కొందరు ఉద్యోగుల తీరు విమర్శలకు తావిస్తోంది. సమయపాలన పాటించడం లేదు. ఏ రోజు కూడా పూర్తిస్థాయిలో సిబ్బంది హాజరైన దాఖలాలు లేవు. వారి కోసం ఎవరైనా అడిగితే ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారు అని మిగతా సిబ్బంది సమాధానం చెప్పడం కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయి దృష్టిసారించకపోవడంతో సచివాలయ సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా పరిస్థితి మారింది. వారిని గాడినపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు.. ప్రజలకు అందుతున్న సేవలు.. సిబ్బంది సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం విజిట్ నిర్వహించింది. ఈ పరిశీలనలో పలు విషయాలు వెలుగుచూశాయి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 732 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 75 వార్డు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. కొద్దినెలల కిందట ప్రభుత్వం రేషనలైజేషన్ నిర్వహించి సచివాలయ సిబ్బందికి ఉద్యోగోన్నతులు కల్పించింది. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకుంది. 732 సచివాలయాలకు మొత్తం 7,200 మంది సిబ్బంది ఉండాల్సి ఉంది. కానీ 6,416 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 700పైబడి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
- ‘ఆంరఽధజ్యోతి’ బృందం సోమవారం పలు సచివాలయాలను పరిశీలించింది. ఏ ఒక్క సచివాలయంలో కూడా పూర్తిస్థాయిలో సిబ్బంది విధులకు హాజరుకాలేదు. ఒకరు నుంచి ముగ్గురు వరకు మాత్రమే ఉన్నారు. మిగిలినవారు ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారంటూ సిబ్బంది బదులిస్తున్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాల్లో వార్డు సచివాలయాలను మున్సిపల్ కమిషనర్‌లు పర్యవేక్షిస్తున్నారు. గ్రామ సచివాలయాలను ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారు. ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతగా లేదు. 8 నుంచి 10 మంది సిబ్బందికి గాను కేవలం ఇద్దరు.. ముగ్గురు మాత్రమే ఉంటున్నారు. సమయపాలన పాటించకపోవడం పలు చోట్ల కనిపించింది.
- ఇతర ప్రభుత్వ విభాగాల మాదిరిగా సచివాలయాల్లోనూ డెప్యుటేషన్ నడుస్తోంది. పలుకుబడి కలిగినవారు... ఉన్నతాధికారుల మెప్పు పొందినవారు.. ఇతరత్రా కారణాలు.. సిఫారసులతో డెప్యుటేషన్‌పై ఇతర కార్యాలయాలకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల ప్రజలకు గ్రామాల్లో సరిగ్గా సేవలందడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఆ ప్రాంతంలో సచివాలయాల సిబ్బంది కొంతమంది కలెక్టరేట్‌లో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.