తమ్ముడిని కాపాడి .. అనంతలోకాలకు
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:46 AM
నాగావళి నదిలోని ఊబిలో కూరుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. తన తమ్ముడిన కాపాడి.. చివరకు అనంత లోకాలకు చేరుకున్నాడు.
- నాగావళి నదిలో మునిగి విద్యార్థి మృతి
- ఊపిరి తీసిన ఊబి
- శుభ కార్యానికి వచ్చి విగతజీవిగా మారిన వైనం
- శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
శ్రీకాకుళంరూరల్/పాలకొండ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నాగావళి నదిలోని ఊబిలో కూరుపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. తన తమ్ముడిన కాపాడి.. చివరకు అనంత లోకాలకు చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాలకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ నవనంపాడు గ్రామానికి చెందిన ద్వారపూడి పవన్(16) విశాఖలోని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పవన్ తండ్రి రవి, తల్లి వసంత జీవనోపాధి కోసం విశాఖపట్నంలో ఉంటూ గ్రామానికి వస్తూ వెళ్తూ ఉండేవారు. తమ బంధువుల గృహ ప్రవేశం సందర్భంగా శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి పవన్ పాలకొండ మండలం అన్నవరం గ్రామం చేరుకున్నాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికని తన తమ్ముడు భార్గవ్, చిన్నాన్నతో కలిసి ఆ గ్రామంలోని నాగావళి నదికి వెళ్లాడు. తొలుత భార్గవ్ నదిలో దిగేందుకు ప్రయత్నించి అక్కడున్న ఊబిలోకి కూరుకుపోయాడు. ఇది గమనించిన పవన్ భార్గవ్‌ను ఒడ్డుకు లాగి ప్రమాదవశాత్తూ నదిలోని అదే ఊబిలో కూరుకుపో యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నది వద్దకు చేరుకుని పవన్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. ఊబిలోనుంచి పవన్‌ను బయటకు తీశారు. అప్పటికే స్పృహ కోల్పోయి ఉండడంతో సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే పవన్ మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ద్వారపూడి రవి, వసంతలు భోరున విలపించారు. అంతవరకు తమతో ఉన్న కుమారుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు గృహ ప్రవేశానికి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అందరితో సరదాగా గడిపిన పవన్ విగతజీవిగా మారడంతో కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాలకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక తవ్వకాలే కారణమా?
అన్నవరం గ్రామ సమీపంలోని నాగావళి నది తీరంలో నిత్యం ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. ఇవి గమనించక నదిలో స్నానాలు, ఇతర అవసరాల కోసం దిగుతున్న వారు మృత్యువాత పడుతున్నారు. పవన్ మృతికి కూడా ఆ గుంతలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.