Gauthu Lachanna's birthday: ‘సర్దార్’ సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:34 PM
'Sardar's birthday celebrations స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి
శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న సేవలు, పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గొండు.శంకర్, మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీలతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌతు లచ్చన్న జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాం. స్వాతంత్య్ర పోరాట సమయంలో, తర్వాత బీసీలకు రిజర్వేషన్లు రావడంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించార’ని తెలిపారు. మాజీమంత్రి గౌతు శివాజీ మాట్లాడుతూ తన తండ్రి, గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఫలాలు బడుగు, బలహీన వర్గాలకు చేరాలనే ఆశయంతో గౌతు లచ్చన్న ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం నడుచు కోవాలని కోరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ‘దేశంలోనే జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు. దేశంలో సర్దార్ అనే బిరుదు ఇద్దరికే వచ్చింది. అందులో ఒకరు వల్లభాయ్ పటేల్ కాగా, మరొకరు సర్దార్ గౌతు లచ్చన్న’ అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, బీసీ వెల్ఫేర్ అధికారి అనూరాధ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.