అరసవల్లిలో అదేతీరు
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:35 PM
No facilities in arasavalli అరసవల్లిలోని ఆదిత్యాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆదిత్యాలయంలో కానరాని సౌకర్యాలు
భక్తులకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి/ పాత శ్రీకాకుళం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ఆదిత్యాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కరువవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. కాగా.. ఇంద్ర పుష్కరిణిలో చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణం చూసి.. స్నానాలు చేసేందుకు భక్తులు వెనుకంజ వేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కూడా సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణంలో రహదారులపై ఎక్కడికక్కడ గోతులు కప్పకుండా వదిలేశారు. పందిర్ల కోసం తెచ్చిన సరుగుడు కర్రలు, ఇనుప కంచెలు రహదారిపై అస్తవ్యస్తంగా పడేశారు. కల్యాణ కట్ట దగ్గర కూడా అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. అన్నదానం, ఉచిత దర్శన క్యూలైన్లు, గోశాల, కళ్యాణకట్ట, స్నానపు గదుల సౌచాలయాలు, ప్రసాదాల విక్రయాల వద్ద మార్గం తెలిపే బోర్డులు లేక దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
అడ్డగోలుగా దుకాణాలు
ఆదిత్యాలయ ఆవరణలో అడ్డగోలుగా దుకాణాలు వెలిశాయి. భక్తుల ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసేందుకు కూడా స్థలం లేదు. నడిచేందుకు కూడా మార్గం లేకుండా ఎక్కడికక్కడ దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఆలయానికి సంబంధించి 12 దుకాణాలు ఉండేవి. వాటి నిర్వాహకులు ప్రతి నెలా ఆలయానికి అద్దె కూడా చెల్లించేవారు. గత ఏడాది రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఆలయం ఎదురుగా ఉన్న భవనాలను కూల్చేశారు. దీంతో అప్పటి నుంచి వ్యాపారులు రోడ్డుమీదే తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఇదే అదనుగా ఆలయంలో పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులు, ఇతర సిబ్బందికి చెందినవారు ఆలయానికి ఎదురుగా ఇరువైపులా ఇష్టారాజ్యంగా తోపుడుబళ్లను ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దుకాణాల సంఖ్య 34కి చేరింది. ఈ దుకాణాల వలన ఆలయ ఆదాయానికి గండి పడడమే కాకుండా, పారిశుద్ధ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
భక్తులకు బంగారు, వెండి కళ్ల ప్రతిమలు పేరుతో కొంతమంది వ్యాపారులు నకిలీవి విక్రయిస్తున్నారు. ఈ నకిలీ వ్యాపారం వలన ఆలయానికి ఏడాదికి సుమారు రూ.15లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గతంలో ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడంతో కొన్ని నెలల పాటు నకిలీ కళ్ల వ్యాపారం ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికైనా పోలీసులు, అధికారులు స్పందించి ఆలయానికి ఎదురుగా ఉన్న అనధికార దుకాణాలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.