Share News

పూండి రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:12 AM

ఉద్దానం వాసుల చిరకాల కోరిక తీరనుంది. పూండిరోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి.

పూండి రోడ్డుకు మోక్షం
బెండిగేటు- పూండి రోడ్డు

- విస్తరణకు రూ.100 కోట్లు మంజూరు

- 58 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో నిర్మాణం

- ఐదు మండలాల ప్రజలకు ప్రయోజనం

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఉద్దానం వాసుల చిరకాల కోరిక తీరనుంది. పూండిరోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఐదు మండలాలను కలుపుతూ సుమారు 58 కిలో మీటర్ల పొడవున రెండు లైన్ల రోడ్డు నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రోడ్డును నిర్మించనున్నాయి.

ఇదీ పరిస్థితి..

వజ్రపుకొత్తూరు మండలం వెంకటాపురం నుంచి బెండిగేటు మీదుగా పూండి, సంతబొమ్మాళి మండలం నౌపాడ నుంచి పోలాకి మండలం డోలా వరకు సుమారు 58 కిలోమీటర్ల పొడవున బ్రిటీష్‌ కాలంలో రోడ్డును వేశారు. అప్పట్లో అది మట్టి రోడ్డు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు తారు రోడ్డుగా మార్చాయి. జనాభా, వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో పూండి రోడ్డు రద్దీగా మారింది. పైగా సింగిల్‌ రోడ్డు కావడంతో నిత్యం ప్రమాదాలు జరిగేవి. చాలామంది మృత్యువాత పడగా, మరికొంతమంది తీవ్రగాయాలతో మంచపట్టారు. పూండి రోడ్డును విస్తరించాలని, రెండులైన్లగా మార్చాలని ఈ ప్రాంతీయుల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీనికోసం మండల సమావేశాల్లో తీర్మానాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు నిర్మాణం కోసం హడావిడి చేసినా పనులు మాత్రం చేపట్టలేకపోయింది. ఈ క్రమంలో పూండి రోడ్డు విస్తరణ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఢిల్లీ వెళ్లి కేంద్రంమంత్రులను కలిశారు. దీంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లు నిధులు విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ రోడ్డును నిర్మించనున్నాయి. ఈ రోడ్డు పనులు పూర్తయితే వాణిజ్య కేంద్రంగా పూండి మరింత అబివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఈ ప్రాంతీయులు వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

వెంకటాపురం-పూండి మీదుగా డోలా వరకు సుమారు 58 కిలో మీటర్లు పొడవున రహదారి నిర్మాణానికి కేంద్రం జీవో విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఒకటి రెండు నెలల్లో విస్తరణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఐదు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.

-జగదీష్‌, జేఈ, ఆర్‌అండ్‌బీ

ఎమ్మెల్యే కృషి మరువలేనిది

పూండి రోడ్డు విస్తరణ చేపడతానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే శిరీష నిలబెట్టుకున్నారు. నిధుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కేంద్రమంత్రులను ఒప్పించారు. ఆమె కృషి మరువలేనిది. రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే పూండి ప్రాంతం మరింత అభివృద్ది చెందుతుంది.

-పుచ్చ ఈశ్వరరావు, అగ్నికులక్షత్రియ డైరక్టర్‌, పూండి

Updated Date - Aug 07 , 2025 | 12:12 AM