Road devolpment{ పూడిలంకకు మోక్షం
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:53 PM
Poodilanka village road చిరకాల సమస్యగా ఉన్న పూడిలంక గ్రామానికి వంతెనతో కూడిన రహదారి నిర్మిస్తామని రాష్ట్ర మత్స్య, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి రూ.నాలుగు కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రూ.4కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంత్రి అచ్చెన్నాయుడు
వజ్రపుకొత్తూరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): చిరకాల సమస్యగా ఉన్న పూడిలంక గ్రామానికి వంతెనతో కూడిన రహదారి నిర్మిస్తామని రాష్ట్ర మత్స్య, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి రూ.నాలుగు కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘టీడీపీ హయాంలో పూడిలంక రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి కొంతమేర పనులు చేపట్టాం. తర్వాత వైసీపీ పాలనలో పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి మేరకు ఈసారి శాశ్వత ప్రాతిపదికగా ఉపాధిహామీ నిఽధులతో నిర్మాణం చేపడుతున్నాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.100 కోట్లతో పూండి రోడ్డు కూడా నిర్మిస్తాం. టెండర్లు పూర్తయిన వెంటనే పనులు చేపట్టనున్నాం. పూండి రోడ్డు విస్తర్ణణ పూర్తయితే మూడు మండలాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. బెండిరోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. వైసీపీ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నా.. హామీలన్నీ నెరవేరుస్తున్నామ’ని తెలిపారు.
పర్యాటకాభివృద్ధికి కృషి : కలెక్టర్
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. ‘పూడిలంక వంతెన పూర్తయిన వెంటనే.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తాం. పర్యాకాభివృద్ధితో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. పూడిలంకలో 56ఇళ్లు మాత్రమే ఉన్నా.. మహత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష, ఆర్డీవో జి.వెంకటేష్, నాయకులు వజ్జ బాబురావు, సూరాడ మోహనరావు, నెయ్యల సూర్యనారాయణ, అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వర్రావు, మాజీ ఎంపీపీ వసంతస్వామి, బి.శశి పాల్గొన్నారు.