Share News

Tiranga rally: సైనికులకు సెల్యూట్‌

ABN , Publish Date - May 17 , 2025 | 11:34 PM

Indian Army National security పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకగా.. భారత సైనికులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట బుద్ధి చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. సైన్యానికి మద్దతు తెలియజేస్తూ.. తిరంగా ర్యాలీ నిర్వహించారు.

Tiranga rally: సైనికులకు సెల్యూట్‌
తిరంగా ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, తదితరులు

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పోరాట స్ఫూర్తితో తిరంగా ర్యాలీ

  • భారతీయుల విజయమంటూ.. మంత్రి అచ్చెన్న హర్షం

  • టెక్కలి, మే 17(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతీకగా.. భారత సైనికులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట బుద్ధి చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. సైన్యానికి మద్దతు తెలియజేస్తూ.. తిరంగా ర్యాలీ నిర్వహించారు. శనివారం కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతోపాటు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొత్తమ్మతల్లి ఆలయం నుంచి రైతుబజారు వరకు త్రివర్ణ పతకాలతో ర్యాలీ నిర్వహిస్తూ.. అమర జవానులకు నివాళులర్పించారు. త్రివిధ దళాల ధైర్యసాహసాలను కొనియాడారు. ‘సైనికులకు సెల్యూట్‌.. జై జవాన్‌’ , ‘భారత మాతాకీ జై, వందే భారత్‌’ అంటూ.. నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా భారత్‌ విడిచిపెట్టదు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భద్రతాదళాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయి. ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులకు ప్రతి ఒక్కరూ సెల్యూట్‌ చెప్పాల’ని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌, బీజేపీ నాయకులు అట్టాడ రవిబాబ్జీ, బి.ఉమామహేశ్వరరావు, బోయిన గోవిందరాజులు, ఎల్‌ఎల్‌ నాయుడు, బోయిన రమేష్‌కుమార్‌, పినకాన అజయ్‌కుమార్‌, జీరు భీమారావు, వెలమల విజయలక్ష్మి, నంభాళ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:34 PM