కఠ్మాండూలో క్షేమంగా..
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:11 AM
Kasibugga residents safe in hotel నేపాల్‌లోని కఠ్మాండులో కాశీబుగ్గ వాసులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందింది. కాశీబుగ్గకు చెందిన తాళాసు నర్సింహమూర్తి, రమాదేవి దంపతులు.. ఇటీవల మానససరోవర్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నేపాల్ రాజధాని కఠ్మాండూలో చిక్కుకున్నారు. వారితో జిల్లా రెవెన్యూ అధికారులు, ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో మాట్లాడగా.. అక్కడ కైలాస్‌కుట్టి లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది.
హోటల్‌లో సురక్షితంగా ఉన్న కాశీబుగ్గ వాసులు
వారితో ఫోన్‌లో మాట్లాడిన జిల్లా రెవెన్యూ అధికారులు
పలాస, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): నేపాల్‌లోని కఠ్మాండులో కాశీబుగ్గ వాసులు క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందింది. కాశీబుగ్గకు చెందిన తాళాసు నర్సింహమూర్తి, రమాదేవి దంపతులు.. ఇటీవల మానససరోవర్ యాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నేపాల్ రాజధాని కఠ్మాండూలో చిక్కుకున్నారు. వారితో జిల్లా రెవెన్యూ అధికారులు, ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో మాట్లాడగా.. అక్కడ కైలాస్‌కుట్టి లాడ్జిలో సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అందింది. నర్సింహమూర్తి కాశీబుగ్గలోని ఏ-1 క్యాజూ షాపు నిర్వహిస్తున్నారు. దొడ్ల హేమంత్‌కుమార్(విజయవాడ)కు చెందిన ట్రావెల్స్‌లో విజయవాడ, హైదరాబాద్, కాశీబుగ్గకు చెందిన మొత్తం 64మంది మానససరోవర్ యాత్రకు పది రోజుల కిందట వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో నేపాల్‌లో అల్లర్లు కారణంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం విధితమే. ఈ నేపఽథ్యంలో తెలుగువారు, పర్యాటకులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానసర్వీసులు ఏర్పాటు చేసింది. అయితే ట్రావెల్స్ నిర్వాహకులు, నేపాల్ పర్యాటకశాఖ, చైనా ట్రావెల్స్ ఏజెన్సీ సంయుక్తంగా పర్యాటకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్పించింది.
కఠ్మాండూలో ఉన్న కాశీబుగ్గ వాసి నర్సింహమూర్తితో గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో మాట్లాడగా.. ‘నేపాల్‌లో ప్రత్యేక భద్రత మధ్య లాడ్జిలో మాకు బస కల్పించారు. మొత్తం 64 మంది పర్యాటకులం ఉన్నాం. మేమంతా క్షేమంగానే ఉన్నాం. ఆహారం, తాగునీరు సకాలంలో అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. శుక్రవారం మమ్మల్ని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. మాకు శ్రీకాకుళం జిల్లా రెవిన్యూ అధికారుల నుంచి కూడా ఫోన్‌కాల్ వచ్చింది. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు’ అని చెప్పారు. అలాగే నర్సింహమూర్తితో పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి ఫోన్‌లో మాట్లాడారు. ఎటువంటి సహాయం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. స్వదేశం వచ్చేందుకు.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం విమానసౌకర్యం కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇదిలా ఉండగా సదరన్‌ట్రావెల్స్ ఆధ్వర్యంలో కూడా కాశీబుగ్గకు చెందిన జీజేఎస్.రెడ్డి, గిన్ని లలితా దంపతుల బృందం మానససరోవర్ యాత్రకు వెళ్లింది. వీరితోపాటు విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చెందిన 22 మంది పర్యాటకులు వెళ్లారు. వీరంతా సురక్షితంగా గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ నుంచి వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు రానున్నారు.