Share News

రిజిస్ట్రేషన్ల జోరు

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:04 AM

Sales increased in six months ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం అందించే వాటిలో కీలకమైనది స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ. గతంతో పోల్చితే క్రయవిక్రయాలకు వాతావరణం అనుకూలంగా ఉండటం.. నిబంధనలు సడలింపు... రిజిస్ట్రేషన్ల సులభతరం ఇటువంటివన్నీ రిజిస్ట్రేషన్‌ శాఖకు కలిసివచ్చాయి. జిల్లాలో రిజిస్ర్టేషన్లు జోరుగా సాగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ల జోరు
శ్రీకాకుళంలో జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

తొలి ఆరునెలల్లో పెరిగిన క్రయవిక్రయాలు

లక్ష్యం రూ.121.47 కోట్లు

ఆదాయం రూ.107.75 కోట్లు

88.70 శాతం రాబడితో పర్వాలేదనిపించిన జిల్లా

శ్రీకాకుళం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం అందించే వాటిలో కీలకమైనది స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ. గతంతో పోల్చితే క్రయవిక్రయాలకు వాతావరణం అనుకూలంగా ఉండటం.. నిబంధనలు సడలింపు... రిజిస్ట్రేషన్ల సులభతరం ఇటువంటివన్నీ రిజిస్ట్రేషన్‌ శాఖకు కలిసివచ్చాయి. జిల్లాలో రిజిస్ర్టేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం(2025-26) తొలి ఆరు నెలల్లో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు దాదాపు ప్రభుత్వ లక్ష్యానికి చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 13 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆదాయం రూ.121.47 కోట్లు సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. కాగా.. ఈ ఆరు నెలల్లో జిల్లావ్యాప్తంగా 35,202 డాక్యుమెంట్స్‌ రిజిస్టర్‌ అయ్యాయి. రూ.107.75 కోట్లు ఆదాయం సమకూరింది. కొన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు లక్ష్యాన్ని అధిగమించాయి. మరికొన్ని 70 శాతానికిపైగా, ఇంకొన్ని కార్యాలయాలు వంద శాతానికి సమీపంలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 88.70శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయి. శ్రీకాకుళం నగరంలో అత్యధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగినా.. ఆ స్థాయిలో ఆదాయం లభించలేదు.

లక్ష్యానికి మించి..

ప్రభుత్వం మారడంతో గతేడాది అంతంతమాత్రంగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకోవడంతో జిల్లాలో భూ లావాదేవీలు.. ఆస్తి విక్రయాలు భారీసంఖ్యలో పెరిగాయి. ఖాళీస్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, నివాస స్థలాల విక్రయాలు ఊపందుకున్నాయి. పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, నరసన్నపేట సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నూరు శాతం రిజిస్ట్రేషన్ల లక్ష్యాలను దాటేశాయి. ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా ‘బూమ్‌’ పెరిగింది. ఈ ప్రాంతాల్లో నిర్మాణరంగం జోరందుకుంది. వీటితో పోల్చితే... హిరమండలం, రణస్థలం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం లక్ష్యాలను 90శాతం చేరుకున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌ విధానం కలిసి వచ్చింది. ఒకప్పటితో పోల్చితే డాక్యుమెంట్‌ విధానం సరళీకరణ.. మరింత సులభతరమైంది. వ్యాపారులు.. సామాన్యులు ఈ దఫా భూ కొనుగోలుపైనే ఎక్కువగా దృష్టిసారించడంతో ప్రభుత్వ ఖజానా కాస్త కళకళలాడుతోంది.

ఆ నాలుగు స్థానాల్లో 70 శాతంపైగా

కాశీబుగ్గ, మందస, పొందూరు, కోటబొమ్మాళి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో లక్ష్యంలో 70 శాతాన్ని దాటాయి. పెద్దగా గతం కంటే మార్పులేదు. ఈ ప్రాంతాల్లో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడి వాసులు పక్క పట్టణాల్లోను.. ఇతర ప్రాంతాల్లోను ఆస్తులు కొనుగోలు చేసి అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. దీంతో ఈ నాలుగు స్థానాల్లో 70శాతం మాత్రమే ఆదాయం దాటింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి లక్ష్యాన్ని చేరుకోగలదా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

ఇదీ ఆరునెలల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం

-----------------------------------------------------------------------------------------------------------------

సబ్‌రిజిస్ట్రార్‌ ఏప్రిల్‌-సెప్టెంబరు చేరుకున్న శాతం డాక్యుమెంట్స్‌

కార్యాలయం వరకు టార్గెట్‌ లక్ష్యం

-----------------------------------------------------------------------------------------------------------------

ఆమదాలవలస రూ. 6.28 కోట్లు రూ. 7.03 కోట్లు 111.95 2,753

హిరమండలం రూ. 3.09 కోట్లు రూ. 2.90 కోట్లు 93.64 1,799

ఇచ్ఛాపురం రూ. 5.27 కోట్లు రూ. 5.36 కోట్లు 101.65 2,648

కాశీబుగ్గ రూ. 13.49 కోట్లు రూ. 9.86 కోట్లు 73.15 3,719

కోటబొమ్మాళి రూ. 6.58 కోట్లు రూ. 4.62 కోట్లు 70.13 1,871

మందస రూ. 2.82 కోట్లు రూ. 1.98 కోట్లు 70.25 1,123

నరసన్నపేట రూ. 6.56 కోట్లు రూ. 7.82 కోట్లు 119.18 2,001

పాతపట్నం రూ. 3.99 కోట్లు రూ. 4.16 కోట్లు 104.31 2,103

పొందూరు రూ. 10.96 కోట్లు రూ. 8.51 కోట్లు 77.63 3,052

రణస్థలం రూ. 9.42 కోట్లు రూ. 9.04 కోట్లు 96.04 3,183

సోంపేట రూ. 4.80 కోట్లు రూ. 4.62 కోట్లు 96.23 2,121

శ్రీకాకుళం(ఓ.బీ) రూ. 41.12 కోట్లు రూ. 34.79 కోట్లు 84.61 5,913

టెక్కలి రూ. 7.04 కోట్లు రూ. 7.00 కోట్లు 99.54 2,916

-----------------------------------------------------------------------------------------------------------------

మొత్తం రూ. 121.47 కోట్లు రూ. 107.75 కోట్లు 88.70 35,202

Updated Date - Oct 22 , 2025 | 12:04 AM