గొర్రెల మందపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:23 AM
సుభద్రాపురం- చీపురుపల్లి రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేతకు వెళ్తున్న గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది.
- 17 జీవాలు మృత్యువాత
లావేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సుభద్రాపురం- చీపురుపల్లి రహదారిపై శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేతకు వెళ్తున్న గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 17 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుభద్రాపురం గ్రామానికి చెందిన కోరాడ కోటి, గోవిందరావు, కోండ్రు నారాయణ తమ గొర్రెలను మేత కోసం తోలుకెళ్లుతుండగా సుభద్రాపురం- గురుగుబిల్లి జంక్షన్ మధ్యలో శ్రీకాకుళం నుంచి చీపురుపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మందపైకి దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే 11 గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు గొర్రెలు తీవ్ర గాయాలై గంటల వ్యవధిలోనే అవి కూడా చనిపోయాయి. మృతి చెందిన గొర్రెలకు స్థానిక పశువైద్యాధికారి గాయత్రి పోస్టుమార్టం నిర్వహించారు. వీటి విలువ రూ.1.70 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల యజమానులు కోరుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. కాగా, బస్సు డ్రైవర్ అజాగ్రత్త, మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.