గిరిజన గ్రామాలకు రోడ్లు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:44 PM
CM Chandrababu's special focus గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే తొలుత రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో గిరిజన గ్రామాలకు పట్టించుకోకపోవడంతో వారి బతుకులు అధ్వానంగా మారాయి.
చంద్రబాబు సీఎం అయ్యాక ప్రత్యేక దృష్టి
డోలీ మోతలు లేకుండా ఉండేందుకు..
గతంలో పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
మెళియాపుట్టి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే తొలుత రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వైసీపీ హయాంలో గిరిజన గ్రామాలకు పట్టించుకోకపోవడంతో వారి బతుకులు అధ్వానంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో డోలీ మోతలే గతి. అయితే కూటమి అధికారంలోకి రాగానే వారి ఆశలు నెరవేరుతున్నాయి.
వైసీపీ పాలనలో గిరిజనులకు విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు వంటి కనీస వసతులు కరువయ్యాయి. గిరిజన సబ్‌ప్లాన్ నిధులు సైతం కార్పొరేషన్లకు దారి మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడింది. గత ప్రభుత్వం జిల్లాకు ఐటీడీఏ కేటాయించకుండానే పునర్విభజన చేపట్టింది. రెండు జిల్లాలకూ ఒకే ఐటీడీఏ కావడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు తొలుత గిరిజనాభివృద్ధిపై దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా డోలీమోతలు లేకుండా రహదారి నిర్మాణాలకు ఉపాధిహామీ నిధులను మంజూరు చేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 145 గ్రామాల్లో రహదారులకు నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ముందుగా 72 గ్రామాలకు రూ.51.92 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రహదారులు నిర్మిస్తుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గిరిజన విద్యను గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇటీవల ప్రకటించారు.
సంతోషంగా ఉంది
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం, డిప్యూటీ సీఎం గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సంతోషంగా ఉంది. రహదారి పనులు చేపడుతుండడంతో ఇబ్బందులు తప్పాయి.
- లక్ష్మీపురం కిరణ్‌కూమార్, హిరాపురం
గతంలో వెనుకబాటే..
వైసీపీ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధి వెనుకబడింది. గిరిజన సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించడం వల్ల గత ఐదేళ్లు వెనుకబాటు కనిపించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ఆనందంగా ఉంది.
- బైరిశింగి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ, మెళియాపుట్టి
ప్రతిపాదనలు రూపొందిస్తాం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎంజన్ ద్వారా గిరిజనులుకు ఏమి కావాలో గ్రామసభలు పెట్టి దరఖాస్తులు స్వీకరించింది. ప్రతి గిరిజన గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు రూపొందిస్తాం.
- ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి