Share News

road accident: అయ్యప్ప దీక్ష ముగించుకుని ఇంటికి వస్తుండగా..

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:49 PM

road accident:తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

road accident: అయ్యప్ప దీక్ష ముగించుకుని ఇంటికి వస్తుండగా..
నవీన్‌కుమార్‌(ఫైల్‌), సాయికుమార్‌(ఫైల్‌)

- రామేశ్వరం వద్ద రోడ్డు ప్రమాదం

- ఇద్దరు పలాస యువకుల మృతి

- నలుగురికి గాయాలు

పలాస/రూరల్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరంతా అయ్యప్ప దీక్షను విరమించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన పైడి సాయికుమార్‌(24), పెదంచల గ్రామానికి చెందిన ఇల్లాకుల నవీన్‌(23)తో పాటు పైడి తారకేశ్వరరావు, పైడి గణపతి, తమ్మినాన గణేష్‌, గుంట రాజు అయ్యప్ప మాలలు వేశారు. ఈ నెల 22న సాయికుమార్‌కు చెందిన కారులో వీరంతా శబరిమలై వెళ్లారు. అక్కడ అయ్యప్పస్వామిని దర్శించుకుని దీక్షను విరమించారు. మంగళవారం రామేశ్వరం వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కారులో పలాస బయలుదేరారు. బుధవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవింగ్‌ సీటులో ఉన్న సాయికుమార్‌, నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఆ ప్రాంతంలో ఉన్న రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో గుంట రాజుతో మరొక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులతో పాటు మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన రామేశ్వరం బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ విషయాన్ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందిస్తుంది. ఈ సంఘటనతో మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

పోషిస్తాడు అనుకుంటే..

రామేశ్వరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్‌కు తల్లి గీతమ్మ, తండ్రి జయరామ్‌ ఉన్నారు. వీరికి సాయికుమార్‌ ఏకైన సంతానం. సాయికుమార్‌ ఐటీఐ చదివి డ్రైవింగ్‌ కూడా నేర్చుకున్నాడు. మూడు నెలల కిందట సొంతంగా కారును కొనుగోలు చేశాడు. దీన్ని అద్దెకు తిప్పుతూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. కుటుంబం, తన బాగుకోరి అయ్యప్పస్వామి మాలధారణ చేశాడని, తీర్థయాత్రలు చేసుకొని తిరిగి వస్తే పుణ్యం లభిస్తుందనకుంటే రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని తల్లి గీతమ్మ విలపిస్తుంది. వృద్ధాప్యంలో తమను పోషిస్తాడని అనుకున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని, తమకు ఇక ఎవరు దిక్కని కన్నీరుమున్నీరవుతోంది.

ఫ మరో మృతుడు నవీన్‌ది కూడా ఇదే పరిస్థితి. తండ్రి మృతి చెందగా తల్లి భవాని, తమ్ముడు, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. నవీన్‌ కూడా ఐటీఐ పూర్తి చేశాడు. హెవీడ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉంది. జాతీయరహదారి అంబులెన్స్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అయ్యప్పమాల వేయడంతో సెలవులో ఉన్నాడు. ఈ క్రమంలో రామేశ్వరం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 11:49 PM