Share News

రక్తమోడుతున్న రహదారులు

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:08 AM

accidents Zone జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొంతమంది వాహనదారులు మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితరవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు.

రక్తమోడుతున్న రహదారులు
గరుడఖండి వద్ద రోడ్డు ప్రమాద ఘటన (ఫైల్‌)

  • జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు

  • మితిమీరిన వేగం, నిర్లక్ష్యమే కారణం

  • మృతుల కుటుంబాల్లో తీరని విషాదం

  • పలాస/ ఇచ్ఛాపురం/ నరసన్నపేట, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):

  • గత నెల 27న పలాస మండలం పాత జాతీయరహదారి గరుడఖండి గ్రామం సమీపంలో రెండు ద్విచక్ర వాహ నాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు(25), ఒడిశా రాష్ట్రం ఆర్‌.ఉదయగిరి సమితి డెరబా గ్రామానికి చెందిన సుశాంత్‌జెన్నా(26) అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్‌ ధరించకుండా, మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.

  • గత నెల 10న నరసన్నపేట జాతీయరహదారి కోమర్తి జంక్షన్‌ వద్ద కారు రిపేరు చేస్తుండగా వెనుకనుంచి మరో కారు వచ్చి ఢీకొనడంతో మెకానిక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.

  • ఈ ఏడాది మే నెలలో పాతపట్నం-పర్లాకిమిడి హైవే రోడ్డులో రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం కారణంగా మూడు నిండుప్రాణాలు గాలిలో కలసిపోయాయి.

  • 2021లో పలాస జాతీయ రహదారి రంగోయి వద్ద నలుగురు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. వారు బొలేరా వాహనంలో మితిమీరిన వేగంతో వచ్చి డివైడర్‌ను ఢీకొని.. పక్కరోడ్డుపైకి దూసుకెళ్లి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

  • .. ఇలా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొంతమంది వాహనదారులు మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితరవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రమాద ఘటనలు మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తరచూ కొన్ని ప్రాంతాల్లోనే ప్రమాదాలు జరుగుతుండగా.. వాటి నివారణలో పోలీసు శాఖ విఫలమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం జాతీయ రహదారులపై, ఫ్లైఓవర్ల కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. కోమర్తి, టెక్కలి, ఐతమ్‌ కళాశాల రోడ్డు, తామరాపల్లి, కొత్తగ్రహారం, కేదారిపురం, శాసనం, కోసంగిపురం, రామకృష్ణాపురం, సొండోడికొట్టు జంక్షన్‌, రంగోయి జంక్షన్‌, మందస సర్వీసు రోడ్డు, కంచిలి-మఖరామపురం జంక్షన్‌, ఇచ్ఛాపురం టోల్‌ప్లాజా వద్ద ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రుల ప్రయాణాలు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. గతంలో హైవేతోపాటు ముఖ్యకూడళ్లు, టోల్‌ప్లాజాలు వద్ద పోలీసులు అర్ధరాత్రి దాటిన తరువాత వాహన డ్రైవర్లును అప్రమత్తం చేసేవారు. రాత్రి 2 నుంచి 4 గంటల వరకు సమీపంలో రెస్ట్‌ పాయింట్ల వద్ద వాహనాలను నిలిపివేయించి.. డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేలా చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ:

  • కారు నడిపే వాహనదారులు తప్పనిసరిగా సీటుబెల్టు పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి.

  • మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, అతివేగంగా ప్రయాణించడం నేరం. ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం రోడ్డు ఎక్కినప్పుడు రోడ్డుపక్కన ఉండే వేగనియంత్రణను గమణించి ప్రయాణించాలి. ముఖ్యకూడళ్లు వద్ద వాహనాలు వేగాన్ని నియంత్రించి నెమ్మదిగా వెళ్లాలి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో వేకువజామున ప్రయాణం ప్రమాదకరం. రోడ్డుపై పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనాలు నియంత్రణలో నడపాలి.

  • నిబంధనలు పాటించాలి

  • నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగవు. హెల్మెట్‌, సీటుబెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. రహదారులపైకి వెళ్లేటప్పుడు వేగాన్ని అదుపులోకి పెట్టుకోవాలి. ఎదురుగా వెళ్తున్న వాహనాల స్పీడు గుర్తించి.. నియంత్రిస్తే మంచిది.

    - బి.గోపాల్‌, స్వచ్ఛంద సేవకుడు, కాశీబుగ్గ

  • అవగాహన కల్పిస్తున్నాం

    రోడ్డు ప్రమాదాల నియంత్రణపై యువతకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయరహదారులపై సిబ్బందిని పెట్టి వాహనాల వేగాన్ని నియంత్రిస్తున్నాం. హెల్మెట్‌, సీటుబెల్టు లేని వాహనాలు గుర్తించి అపరాధ రుసం వసూలు చేస్తున్నాం. రాత్రులు ఇచ్ఛాపురం, లక్ష్మిపురం, మడపాం టోల్‌ప్లాజాల వద్ద డ్రైవర్లకు నీటిని స్ర్పే చేసి వారికి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం.

    - లక్ష్మణరావు, డీఎస్పీ, కాశీబుగ్గ..

Updated Date - Dec 06 , 2025 | 12:08 AM