accident: పుట్టినరోజు వేడుకకు వెళ్తూ..
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:30 AM
birthday celebration లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పాతపట్నం మండలం పెదలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి మీనాక్షి(60), ఆమె కుమారుడు లక్ష్మణరావు(28), అల్లుడు ఉగ్రిపల్లి భాస్కరరావు(40)తోపాటు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరి శంకరంపేటకు తోలాపు శంకరరావు(34) ప్రాణాలు కోల్పోయారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
బుడుమూరు వద్ద ఘటన
పాతపట్నం మండలం పెదలోగిడిలో విషాదం
శ్రీకాకుళం/ లావేరు/ పాతపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): మరో గంటలో గమ్యస్థానం చేరుకునేవారు. మురుసటి రోజు శుభకార్యం ఆనందంగా జరుపుకునేవారు. ఆలోపే ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కబళించింది. కారు టైరు పేలి.. అదుపుతప్పి.. ద్విచక్ర వాహనదారుడిని, ఆవెంటనే లారీని ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు కూడా మృతి చెందాడు. బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
...................
లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పాతపట్నం మండలం పెదలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి మీనాక్షి(60), ఆమె కుమారుడు లక్ష్మణరావు(28), అల్లుడు ఉగ్రిపల్లి భాస్కరరావు(40)తోపాటు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరి శంకరంపేటకు తోలాపు శంకరరావు(34) ప్రాణాలు కోల్పోయారు. పెదలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి కాళిదాసుది వ్యవసాయ కుటుంబం. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు సంతు విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఉంటున్నాడు. పెద్దకుమారుడి ఇంట్లో మనువడి పుట్టినరోజు వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముందస్తుగా వెళ్లి ఏర్పాట్లు చూసుకునేందుకుగాను శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాళిదాసు కుటుంబ సభ్యులు బయలుదేరారు. కాళిదాసు, అతని భార్య మీనమ్మ, కుమారుడు లక్ష్మీపతి, అల్లుడు భాస్కరరావు, మనుమరాలు కుసుమతో కలిసి కారులో మధురవాడకు పయనమయ్యారు. సరిగ్గా లావేరు మండలం బుడుమూరు హైవే రోడ్డు వద్ద కారు టైరు పంక్చర్ అయి పేలింది. దీంతో కారు అదుపు తప్పి ముందుగా స్కూటీపై వెళ్తున్న టి.శంకరరావును ఢీకొట్టారు. ఆతర్వాత కారు పల్టీలు కొడుతూ హైవేపై పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనతో కారు, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. శంకరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మీనమ్మ, ఆమె కుమారుడు లక్ష్మీపతి తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవింగ్ చేసిన భాస్కరరావు కొనఊపిరితో ఉండగా స్థానికులు అక్కడకు చేరుకుని 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. భాస్కరరావును 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ప్రమాదంలో కాళిదాసు, మనుమరాలు కుసుమకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను, క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం మార్చురీలో మీనమ్మ, లక్ష్మీపతి, భాస్కరరావు, శంకరరావు మృతదేహాలను భద్రపరిచారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
స్కూటీపై వెళ్తూ.. మృత్యుఒడికి..
సంతకవిటి మండలం మద్దూరి శంకరంపేటకు చెందిన టి.శంకరరావు రణస్థలం మండలంలో బీరు కంపెనీలో పనిచేస్తున్నాడు. బంటుపల్లి గ్రామంలో అద్దె ఇంటిలో నివసిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. శంకరరావు తన స్కూటీపై ఎప్పటిలానే వెళ్తుండగా.. వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొని మృత్యుఒడికి చేరారు.
ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే..
ఇదిలా ఉండగా శనివారం బయలుదేరే ముందు మీనమ్మ.. మధురవాడలో ఉంటున్న తన కుమారుడి సంతుకి ఫోన్ చేసింది. ‘నాన్నా మీ ఇంటికి బయలుదేరాం. మనవడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుందాం. కొన్ని గంటల్లోనే వచ్చేస్తాం’ అని చెప్పింది. ఇంతలోనే ఊహించని విధంగా కొన్ని గంటల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెదలోగిడిలో విషాదఛాయలు
ప్రమాద ఘటన తెలియగానే పాతపట్నం మండలం పెదలోగిడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందరే కారులో సందడిగా మనుమడి పుట్టినరోజు వేడుకలకు బయల్దేరినవారు రెండు గంటల అనంతరం మృత్యుఒడికి చేరిపోయారన్న ప్రమాద వార్త వినడంతో బంధువులు, ఇరుగుపొరుగువారు హతాశులయ్యారు. అక్కడ మధురవాడ నుంచి కాళిదాసు పెదకుమారుడి కుటుంబ సభ్యులు... ఇక్కడ పెదలోగిడిలో నివాసముంటున్న కాళిదాసు కుటుంబం, అల్లుడు భాస్కరరావు బంధువులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న కాళిదాసు, కుసుమను పరామర్శించలేక.. ఇటు మృతదేహాల వద్దకు వెళ్లలేక బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.