Share News

Accident : దైవ దర్శనానికి వెళ్తూ..

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:42 PM

Highway Tragedy accident వారంతా దైవదర్శనానికి ఒడిశా నుంచి విశాఖపట్నం బయలుదేరారు. రెండు వాహనాల్లో మొత్తం 14 మంది వెళ్తుండగా.. దారి మధ్యలో కాలకృత్యాల కోసం ఒక వాహనాన్ని ఆపారు. కాసేపు తర్వాత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి లగేజీ వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

Accident : దైవ దర్శనానికి వెళ్తూ..
ప్రమాదానికి గురైన వాహనం

  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఒడిశా వాసుల దుర్మరణం

  • ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న లగేజీ వ్యాన్‌

  • మృతుల్లో తండ్రి, కుమార్తె..

  • టెక్కలి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): వారంతా దైవదర్శనానికి ఒడిశా నుంచి విశాఖపట్నం బయలుదేరారు. రెండు వాహనాల్లో మొత్తం 14 మంది వెళ్తుండగా.. దారి మధ్యలో కాలకృత్యాల కోసం ఒక వాహనాన్ని ఆపారు. కాసేపు తర్వాత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి లగేజీ వ్యాన్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో తండ్రీ, కుమార్తె ఉండడంతో.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో మంగళవారం ఉదయం 5గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురం ప్రాంతానికి చెందిన గోకుల్‌ పండా(33), మిసినీపూర్‌కు చెందిన సంతోషి సాబతో(4), సుశాంత్‌కుమార్‌ సాబతో(44) మృతి చెందారు. సుశాంత్‌కుమార్‌ సాబతో, సంతోషి సాబతో తండ్రీ కుమార్తెలు. వీరితోపాటు బరంపురం నుంచి రెండు కుటుంబాలకు చెందిన మొత్తం 14 మంది విశాఖపట్నంలోని సింహాచలంలో దైవదర్శనానికి రెండు వాహనాల్లో మంగళవారం వేకువజామున బయలుదేరారు. ఉదయం 5గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు సమీపంలో కాలకృత్యాలకు రోడ్డు పక్కన ఒక వాహనాన్ని నిలిపారు. కాలకృత్యాలు అనంతరం వారు కుడివైపు నుంచి వాహనం ఎక్కుతుండగా వెనుక నుంచి ఓ లగేజీ వ్యాన్‌ ఆగి ఉన్న వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో గోకుల్‌ పండా, సంతోషి సాబతో, సుశాంత్‌కుమార్‌ సాబతోకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గోకుల్‌ పండా, సంతోషి సాబతో, సుశాంత్‌కుమార్‌ సాబతో మృతి చెందారు. సీఐ శ్రీనివాసరావు, నందిగాం ఎస్‌ఐ షేక్‌అహ్మద్‌ ఆలీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నందిగాం ఎస్‌ఐ షేక్‌అహ్మద్‌ ఆలీ తెలిపారు. మృతదేహాలకు శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించామన్నారు. తండ్రీకూతుళ్లు సుశాంత్‌కుమార్‌ సాబతో, సంతోషి సాబతో మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 11:42 PM