Share News

Tribels Rituals..: ఆచారాలు.. వారు మరువరు!

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:47 PM

Festivals are special in tribal villages ఎన్ని తరాలు మారినా ఆదివాసీలు తమ ఆచారాలను మరువలేదు. వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా పండగల్లో తమ ఆచారాల ద్వారా ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

Tribels  Rituals..: ఆచారాలు.. వారు మరువరు!
మెళియాపుట్టి మండలం పరశురాంపురంలో కొండపై దేవతలను పూజిస్తున్న గిరిజనులు

ఇప్పటికీ సంస్కృతీ సంప్రదాయాల ఆచరణ

గిరిజన గ్రామాల్లో పండగలు ప్రత్యేకం

మెళియాపుట్టి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఎన్ని తరాలు మారినా ఆదివాసీలు తమ ఆచారాలను మరువలేదు. వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా పండగల్లో తమ ఆచారాల ద్వారా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే కష్టపడి పండించిన పంటకు సైతం పూజ చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా గిరినుల ఆచారాలపై కథనం..

గిరిజనులు ఏటా మే 14, 15, 16 తేదీల్లో మామిడికాయలు పండుగ జరుపుకుంటారు. తొలిరోజు ఉజ్జిడమ్మను తీసుకువచ్చి.. గ్రామ శివారులో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండో రోజు మామిడికాయలు నైవేద్యం పెట్టి.. ఆరగిస్తారు. మూడోరోజు కొండ దేవత ఇంద్రజమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. కొండలపై పండించిన పంటలతో వంటలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అక్కడే వంటలు చేసి.. బంధువులంతా భోజనాలు చేస్తారు.

ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచారం కూడా ప్రత్యేకమే. కట్నం లేని వివాహాలు జరుగుతాయి. పూర్వం నుంచీ జన్నివారే పూజార్లుగా వ్యవహరిస్తున్నారు. వివాహాలు, శుభకార్యాలు జన్ని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే గిరిజనులు సొంతంగా తయారు చేసిన వాయిద్య పరికరాలనే వినియోగిస్తారు. థింసా నృత్యం, కోయిడ్యాన్స్‌లతో సందడిగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. జొన్నలు, సామలు, రాగులు, కంది తదితర పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వం గిరిజనుల ఆదాయం పెంచేలా.. జీడి, మామిడి, పైనాఫిల్‌, పసుపుతోపాటు అంతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తోంది. గిరిజనులు పండించి ప్రతి పంటకూ పూజలు చేసిన తర్వాతే కోతలు కోస్తారు. పంటకు పూజిస్తే దిగుబడి పెరుగుతుందని వారి నమ్మకం.

కొండదేవతే మాకు రక్షణ

మేము కొండల్లో ఉంటున్నాం. మాకు కొండదేవతే రక్షణ. అందుకే ఏటా కొండదేవతలకు పూజలు చేస్తున్నాం. మాకు మామిడికాయల పండుగ ప్రత్యేకం.

పోలమ్మ, కేరాసింగి, మెళియాపుట్టి

పాఠ్యాంశంగా తీసుకురావాలి

గిరిజన సంప్రదాయలు, సంస్కృతిపై పాఠ్యాంశంగా తీసుకురావాలి. గిరిజన సాంప్రదాయలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సైతం గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అదృష్టంగా భావించాలి.

బైరిశింగి ధరణి, గిరిజన సంఘం నాయకురాలు

Updated Date - Aug 08 , 2025 | 11:47 PM