Share News

కమ్మేస్తున్న కాలుష్యం

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:59 PM

Chemical gases emitted from industries ఒకప్పుడు పచ్చని పంట పొలాలు.. స్వచ్ఛమైన గాలికి చిరునామాగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. జిల్లాలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు ఇష్టారాజ్యంగా కాలుష్యాన్ని విడిచిపెడుతూ.. ప్రజలకు ముప్పు తెస్తున్నాయి. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువవుతోంది.

కమ్మేస్తున్న కాలుష్యం
పైడిభీమవరం పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, చిలకపాలెం- పొందూరు రోడ్డులో కాలుష్యానికి గురై రంగు మారిన చెట్లు

జిల్లాలో పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వాయువులు

నిబంధనలు పాటించని యాజమాన్యాలు

వ్యాధులబారిన పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

శ్రీకాకుళం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పచ్చని పంట పొలాలు.. స్వచ్ఛమైన గాలికి చిరునామాగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. జిల్లాలో విస్తరిస్తున్న పారిశ్రామిక వాడలు ఇష్టారాజ్యంగా కాలుష్యాన్ని విడిచిపెడుతూ.. ప్రజలకు ముప్పు తెస్తున్నాయి. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలకు స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నిబంధనల ప్రకారం పరిశ్రమలు ఎప్పటికప్పుడు గాలి నాణ్యతను పరీక్షించాలి. ప్రమాదకర వాయువులను శుద్ధి చేశాకే బయటకు వదలాలి. కానీ జిల్లాలోని చాలా పరిశ్రమలు ఈ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కాలుష్యభరిత గాలిని పీల్చి జిల్లాలో చాలామంది దగ్గు, జలుబుతోపాటు శ్వాసకోశ, చర్మవ్యాధుల బారిన పడుతున్నారు. గత రెండేళ్లలో శ్వాసకోశ సంబంధిత కేసుల శాతం కూడా పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

పైడిభీమవరంలో దారుణం

జిల్లాలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన పైడిభీమవరం(రణస్థలం మండలం)లో కాలుష్యం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ ఫార్మా కంపెనీలు, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ వాయువులు రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాలను కమ్మేస్తున్నాయి. ఘాటైన వాసనతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎచ్చెర్ల, ఆమదాలవలస పరిసరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పైడిభీమవరంలోని ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే రసాయన గాలులు ప్రధాన సమస్య. సాధారణ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 50-80 మధ్య ఉండాలి. కానీ పైడిభీమవరం పరిసరాల్లో ఇది తరచూ నిర్దిష్ట సంఖ్య దాటుతున్నట్లు సమాచారం. రాత్రివేళల్లో ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉంటోంది.

అంతటా దుమ్ము, ధూళి

పలాస, టెక్కలి ప్రాంతాల్లో గ్రానైట్‌ క్వారీలు, క్రషర్లు, జీడిపిక్కల పరిశ్రమల నుంచి వచ్చే దుమ్ము, ధూళి విపరీతంగా పెరిగిపోయింది. ఈ ధూళి ఇళ్లపై, చెట్లపై, చివరికి పంట పొలాలపై కూడా ఒక పొరలా సిమెంట్‌ రంగులో ఏర్పడుతోంది. దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా చిన్నారులు, వృద్ధులకు ఆయాసం, ఉబ్బసం(ఆస్తమా), చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానిక వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పదిహేను శాతం పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు. అలాగే టెక్కలి, సంతబొమ్మాళి, పాతపట్నం, పొందూరు ప్రాంతాల్లోని స్టోన్‌క్రషర్లు ప్రధాన వాయు కాలుష్య కారకాలు. నిబంధనల ప్రకారం క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము(సస్పెండెడ్‌ పర్టిక్యులేట్‌ మేటర్‌-ఎస్‌పీఎం) 600 మైక్రోగ్రామ్స్‌ పర్‌ క్యూబిక్‌ మీటర్‌ మించకూడదు. కానీ చాలా చోట్ల పరిమితికి మించి దాటుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) తనిఖీల్లో తేలింది. ఇటీవల కొన్ని క్రషర్లకు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు.

పంటలకు ముప్పు..

వాయు కాలుష్యం ప్రభావం వ్యవసాయంపై కూడా పడుతోంది. గాలిలో రసాయనాల మోతాదు పెరగడం వల్ల కొబ్బరి, జీడితోటల దిగుబడి తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. ఆకులు నల్లబడి రాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని కాలుష్య నియంత్రణకు కఠినచర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో శ్రీకాకుళం మరో విషవలయంగా మారే ప్రమాదం ఉంది.

కానరాని చర్యలు

శ్రీకాకుళం నగరానికి వేలాదిమంది ప్రతిరోజు.. పలు పనుల నిమిత్తం వస్తుంటారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తుంటారు. ఎక్కువగా హోటల్స్‌పై ఆధారపడతారు. అయితే హోటళ్లలో వంట చెరకుగా జీడిపిక్కల తొక్కలను, వరి ధాన్యపు పొట్టు(ఊక)ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు పొగగొట్టం నుంచి పైకి నల్లని పొగ విడుదలవుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా తీసుకున్న చర్యలు లేవు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జిల్లాలో పెరుగుతున్న కాలుష్యం, నమోదవుతున్న శ్వాసకో వ్యాధులపై సమీక్ష నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించేవాటిపై కలెక్టర్‌ చర్యలకు ఉపక్రమించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:59 PM