Kidney patients: ఇంకెన్నాళ్లీ చావులు?
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:46 PM
Uddanam Kidney Disease ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ సమస్య వేధిస్తోంది. పాతికేళ్లుగా ఈ ప్రాంతంలో కిడ్నీవ్యాధితో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేలసంఖ్యలో వ్యాధిగ్రస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు, ఉచిత మందులు అందజేస్తోంది. కానీ, కిడ్నీ వ్యాధి వ్యాప్తికి కారణాలు మాత్రం బయటపడడం లేదు.

ఉద్దానంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు
చాపకింద నీరులా ప్రబలుతున్న మహమ్మారి
ఇటీవల మూడురోజుల వ్యవధిలో దంపతుల మృతి
వరుస మరణాలతో ప్రజల్లో భయాందోళన
గ్రామాల్లో కనిపించని వైద్యశిబిరాలు
వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన లండ కర్రెమ్మ(60), లండ అప్పన్న(65) భార్యాభర్తలిద్దరూ ఇటీవల మూడు రోజుల వ్యవధిలోనే కిడ్నీవ్యాధితో మృతి చెందారు. ఈ దంపతులిద్దరూ కొన్నాళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్నారు. కర్రెమ్మ గత నెల 31న కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు. భార్య మృతి చెందిందన్న దిగులుతో కిడ్నీవ్యాధితో బాధ పడుతున్న అప్పన్న కూడా మంచానపడ్డాడు. భార్య చనిపోయిన మూడోరోజు.. (ఈ నెల 2న) అప్పన్న కూడా కన్నుమూశాడు. దంపతులిద్దరూ కిడ్నీవ్యాధితో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగి పోయారు. కిడ్నీ మహమ్మారి ఇంకా ఎంతమంది ప్రాణాలు బలిగొంటుందోనని భయాందోళన చెందుతున్నారు.
వజ్రపుకొత్తూరు, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంత ప్రజలను కిడ్నీ సమస్య వేధిస్తోంది. పాతికేళ్లుగా ఈ ప్రాంతంలో కిడ్నీవ్యాధితో వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేలసంఖ్యలో వ్యాధిగ్రస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు, ఉచిత మందులు అందజేస్తోంది. కానీ, కిడ్నీ వ్యాధి వ్యాప్తికి కారణాలు మాత్రం బయటపడడం లేదు. ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో మూడురోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కిడ్నీవ్యాధితో మృతి చెందడంతో ఈ ప్రాంతవాసుల్లో ఆందోళన పెరిగింది. చాపకింద నీరులా కిడ్నీవ్యాధి ప్రబలుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు, కవిటి, కంచిలి, మెళియాపుట్టి తదితర మండలాల్లో కిడ్నీవ్యాధి ప్రబలి మరణాలు సంభవిస్తున్నా.. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం పరిధిలో నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. కానీ, కిడ్నీవ్యాధి నివారణకు సంబంధించి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పీహెచ్‌సీల్లో రెండోపూట వైద్యులు కూడా ఉండడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతీరోజు ఒక గ్రామంలో స్థానిక ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సహకారంతో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి.. కిడ్నీ వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వాహన సదుపాయాలు ఏవీ?
డయాలసిస్ బాధితులకు ప్రభుత్వం ప్రతీ నెలా రూ.10వేలు చొప్పున పింఛన్ అందజేస్తోంది. కానీ, ఆస్పత్రులకు వెళ్లేందుకు వాహన సదుపాయం మాత్రం కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో డయాలసిస్ బాధితులకు 108 అంబులెన్స్‌లో ఇంటి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి.. తిరిగి తెచ్చేవారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహన సదుపాయాన్ని తీసేశారు. దీంతో డయాలసిస్‌కు వెళ్లేందుకు రూ.6వేలు వరకు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. ఆటోల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి డయాలసిస్ బాధితులకు వాహన సదుపాయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
కారణాలు వెలికితీయాలి
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీవ్యాధి వ్యాప్తికి గల కారణాలు వెలికితీయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సుజలధార నీటిని ప్రతీ కుటుంబానికి 20 చొప్పున ఉచితంగా అందించాలి. టీడీపీ హయాంలో రూ.2 ఉన్న 20 లీటర్ల నీటిక్యాన్‌ను వైసీపీ ప్రభుత్వం రూ.7కి పెంచడంతో భారమవుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచితంగా నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి.
- బర్రి పురుషోత్తం, అక్కుపల్లి
గ్రామాల్లో అవగాహన అవసరం
కిడ్నీవ్యాధి నియంత్రణలో భాగంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. వైద్యశిబిరాలు నిర్వహించి.. ప్రతి ఒక్కరికీ రక్త పరీక్షలు చేయాలి. వ్యాధి ప్రబలడానికి గల కారణాలు వెలికితీయాలి. ప్రాథమిక దశలో వ్యాధిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలి.
- కోనారి గణపతి, బోటనీ అధ్యాపకుడు