Share News

feavers: మంచం పట్టిన ఊరు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:37 PM

Fever outbreak Viral infections జిల్లాలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉండడం, గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు, ఇతరత్రా వ్యాధులు విజృంభిస్తున్నాయి.

feavers: మంచం పట్టిన ఊరు
కొండములగాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

  • జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు

  • డయేరియా కేసులూ నమోదు

  • అధ్వానంగా పారిశుధ్యం నిర్వహణ

  • జాగ్రత్తలు పాటించకపోతే అంతే

  • యంత్రాంగం పనితీరుపై విమర్శలు

  • ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో జ్వరాలు విజృంభించాయి. గత కొద్దిరోజులుగా చాలామంది జ్వరాలబారిన పడ్డారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించింది. ఇంటింటికీ వెళ్లి రక్తనమూనాలు సేకరించింది.

    .....................

  • బూర్జ మండలం గుత్తావల్లి పీహెచ్‌సీ పరిధిలో ఇటీవల డయేరియా ప్రబలింది. పదుల సంఖ్యలో ఆస్పత్రికి చేరారు. ఎల్‌.ఎన్‌.పేట, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోని చాలా గ్రామాల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది.

    .....................

  • రణస్థలం, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉండడం, గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు, ఇతరత్రా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు స్వీయ రక్షణ పాటించడంతో పాటు యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టాలి. లేకుంటే ప్రమాదమే. గత ఏడాది జి.సిగడాం మండలం మెట్టవలసలో డయేరియా బారినపడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభం నుంచే జ్వరాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. టైఫాయిడ్‌, మలేరియా వంటివి అధికంగా నమోదవుతున్నాయి. వైరల్‌ జ్వరాలు సైతం సోకుతున్నాయి. సాధారణంగా జూలై నుంచి అక్టోబరు వరకు వ్యాధుల కాలం. వీటిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టాలి. కానీ జిల్లాలో అటువంటిదేమీ కానరాలేదు. దీంతో ప్రజలు జ్వరాల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

  • వైద్యసేవలు అంతంతమాత్రం..

  • జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన గణాంకాలు పరిశీలిస్తే డయేరియా 581, టైఫాయిడ్‌ 250, మలేరియా 13 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అంతకుమించి కేసులు ఉంటాయని సమాచారం. శ్రీకాకుళం లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, టెక్కలిలో ఏరియా ఆస్పత్రి పెద్దాస్పత్రులుగా ఉన్నాయి. వీటితోపాటు 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 సీహెచ్‌సీలు, 300 వరకు ఉపకేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైద్యసేవలు సక్రమంగా అందక రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఏటా వర్షాకాలం నాటికి వైద్యారోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టేది. ప్రమాదకర జ్వరాలు, వ్యాధుల నియంత్రణకు ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై ఉన్నతస్థాయిలో అధికారులు సమీక్షించేవారు. ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచేవారు. ఆస్పత్రి సలహా మండలి సమావేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది ఆ ప్రణాళిక కొరవడింది. దీనికితోడు గ్రామాల్లో పారిశుధ్య పనులు నిలిచిపోవడంతో దోమలు స్వైరవిహారం చేసి వ్యాధులు పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నామమాత్రపు చర్యలకే పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • డెంగ్యూ నిర్ధారణకు ప్రామాణికమేదీ?

  • డెంగ్యూ జ్వరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటి నిర్ధారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధిష్టమైన సూచనలు చేసింది. ర్యాపిడ్‌ పరీక్షలు ద్వారా నిర్ధారణ అయిన తరువాతే చికిత్స అందించాలి. అయితే వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్‌ పరీక్షను పరిగణలోకి తీసుకోబోమని చెబుతోంది. ఇంతలో రోగి ప్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయి. అయితే ఎలిషా పరీక్ష తరువాతే రోగికి వైద్యసేవలందిస్తామని ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. ఈ పరీక్షకు సంబంధించి పీహెచ్‌సీల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. జిల్లాకు సంబంధించి సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)లో మాత్రమే జరుగుతున్నాయి. దీంతో వైద్యసేవల్లో జాప్యమవుతోంది. జిల్లాలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలీషా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది.

  • పారిశుధ్యం అస్తవ్యస్తం..

  • ప్రధానంగా పారిశుధ్యం లోపించిన ప్రాంతాల్లోనే జ్వరాలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాల్టీలు, మేజర్‌ పంచాయతీల్లో జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో సైతం పారిశుధ్యం అంతంతమాత్రమే. నిధుల కొరత వెంటాడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను అచేతనావస్థలో ఉంచింది. దీంతో పారిశుధ్య పనులు జరగడం లేదు. దాని ఫలితంగానే పారిశుధ్యం క్షీణిస్తోంది. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది.

  • ముందస్తు చర్యలు..

  • ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలందిస్తున్నాం. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. అన్ని ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాం. ప్రజలు పరిశుభ్రతను పాటించాలి. వేడినీటినే తాగాలి. ఆహార పదార్థాలపై మూతలు వేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

    - కె.అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - Jun 15 , 2025 | 11:37 PM