Share News

Attacks.. murders! : దాడులు.. హత్యలు!

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:15 AM

Criminal incidents Law and order జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. కొంతమంది రౌడీషీటర్లు రాజకీయాల్లో చేరి పంచాయతీలు, షటిల్‌మెంట్‌కు పాల్పడుతున్నారు. వాతపెట్టేది వారే.. వెన్నపూసేది వారే అన్నట్టు.. కొంతమంది నేతల ప్రోత్సాహంతో నేర సంస్కృతిని అడ్డం పెట్టుకొని వివాదాస్పద భూములు, స్థలాల విషయంలో బాధితులను భయపెడుతున్నారు.

Attacks.. murders! : దాడులు.. హత్యలు!

  • జిల్లాలో పెరుగుతున్న నేర ఘటనలు

  • రౌడీషీటర్లకు కొందరు నేతల ప్రోత్సాహం

  • పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపాల్సిందే

  • రణస్థలం, జూలై 17(ఆంధ్రజ్యోతి):

  • ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట సమీపంలో ఈ నెల 11న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వెళ్తుండగా అడ్డగించి దాడి చేసి చంపేశారు. రాజకీయ నేతలకు అనుచరుడిగా వ్యవహరించే ఆ వ్యక్తి.. ఓ భార్యాభర్తల తగాదాలో పెద్ద మనిషిగా వ్యవహరించి పంచాయతీ చేయడమే ఈ హత్యకు దారితీసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

  • గత ఏడాది డిసెంబరులో పలాసలో టీడీపీ నేతను మట్టుబెట్టేందుకు బిహారీ గ్యాంగ్‌ రంగంలోకి దిగింది. కూటమి పాలనలో ఆ టీడీపీ నేత ఆధిపత్యం పెరుగుతుండడాన్ని ప్రత్యర్థులు సహించలేక పోయారు. రూ.10లక్షలు సుఫారీ ఇచ్చి టీడీపీ నేతను హత్య చేయాలని పన్నాగం పన్నారు. కానీ పోలీసులు ముందే గ్రహించడంతో నిందితులు పట్టుబడ్డారు.

  • గత ఏడాది అక్టోబరులో పోలాకి మండలంలో ఓ పార్టీ కార్యకర్తను ప్రత్యర్థులు నరికి చంపేశారు. వనవిష్ణుపురంలో గ్రామదేవత ఉత్సవాల సమయంలో రాజకీయ విభేదాలు రావడంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఒక వ్యక్తి మృతిచెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

  • 2024 ఫిబ్రవరిలో ఎచ్చెర్లలో ఓ వైసీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. పొలం నుంచి వస్తున్న నేతను అటకాయించి ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. ఈ ఘటనలో సదరు నేత తీవ్రంగా గాయపడగా, స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.

  • 2023 ఏప్రిల్‌లో పలాస మండలానికి చెందిన ఓ పార్టీ నేత, సర్పంచ్‌ భర్తపై ప్రత్యర్థులు దాడిచేశారు. అప్పట్లో ఓ మంత్రి ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగినట్టు ఆరోపణలున్నాయి.

  • 2022 డిసెంబరు 6న గార మండల ఉపాధ్యక్షుడు దారుణంగా హత్యకు గురయ్యారు. తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాడని.. తమ వ్యాపారాన్ని సైతం అడ్డుకుంటున్నాడని భావించి సొంతపార్టీ నేతలే సుఫారీ ఇచ్చి అప్పట్లో హత్య చేయించినట్టు పోలీస్‌ విచారణలో తేలింది.

  • జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. కొంతమంది రౌడీషీటర్లు రాజకీయాల్లో చేరి పంచాయతీలు, షటిల్‌మెంట్‌కు పాల్పడుతున్నారు. వాతపెట్టేది వారే.. వెన్నపూసేది వారే అన్నట్టు.. కొంతమంది నేతల ప్రోత్సాహంతో నేర సంస్కృతిని అడ్డం పెట్టుకొని వివాదాస్పద భూములు, స్థలాల విషయంలో బాధితులను భయపెడుతున్నారు. మధ్యవర్తులుగా వ్యవహరించి కమీషన్లు కొట్టేస్తున్నారు. ఎదురు తిరిగితే తమ రౌడీ మార్కు చూపిస్తున్నారు. ఈక్రమంలో నేరసంస్కృతి పెరిగిపోతోందని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు.

  • సమస్యాత్మక గ్రామాల్లో అధికం..

  • జిల్లాలో చాలా గ్రామాల్లో రాజకీయ, వర్గ విభేదాలు పతాకస్థాయిలో ఉన్నాయి. ప్రతి మండలంలో ఐదారు గ్రామాల వరకూ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో అరాచకాలు సృష్టించేవారు, అధికంగా కేసులు నమోదయ్యే వారిపై పోలీసులు రౌడీషీట్లు తెరిచారు. పోలీస్‌ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 646 మందిపై రౌడీషీట్లు ఉండేవి. కానీ చాలామందిలో మార్పు రావడంతో తొలగించారు. ప్రస్తుతం 113 మందిపై రౌడీషీట్లు ఉన్నాయి. చాలా గ్రామాల్లో రాజకీయ ప్రత్యర్థులు, ఒకే పార్టీలో వర్గాలు, సామాజికవర్గాల మధ్య విభేదాలు వంటివి కొనసాగుతున్నాయి. వీటికి రాజకీయ నేతలే పెంచి పోషిస్తున్నారు. కేవలం ఒకరిద్దరు నేతల ప్రయోజనాలు, కుటుంబాల ఆధిపత్యం కోసం గ్రామాల ప్రజలు ప్రజలు అడ్డగోలుగా చీలిపోతుంటారు. ప్రత్యర్థులపై పట్టు సాధించే క్రమంలో గొడవలు, వివాదాలు, చివరకు హత్యలు చేసే దాకా పరిస్థితి వస్తోంది.

  • ఉదాసీనత ఎందుకో..

  • అన్ని రాజకీయ పార్టీల్లోనూ పెద్ద పెద్ద నాయకుల వద్ద రౌడీషీటర్లు ఉన్నారు. అవసరానికి ఆ నేతలు వారిని వాడుకుంటూ.. రాజకీయాల్లో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎస్పీ మహేశ్వరరెడ్డి సంస్కరణలు చేపట్టినా.. రౌడీషీటర్ల విషయంలో పోలీసుశాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతీవారం రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఎస్పీ ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. జిల్లాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా రౌడీషీటర్ల విషయంలో ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

  • పటిష్ఠ చర్యలు

  • జిల్లాలో నేర నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాం. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. రౌడీషీటర్లపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తాం. లేనిపోని వర్గ విభేదాలతో చాలామంది విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేసుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం వారిలో మార్పు రావాలి.

    - సీహెచ్‌ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం

Updated Date - Jul 18 , 2025 | 12:15 AM