Vegetable prices: బె‘ధర’గొడుతున్నాయ్
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:53 PM
Market inflation Vegetable prices నెల రోజుల కిందట సామాన్యులకు అందుబాటులో ఉండే కూరగాయల ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాభావం, మరికొన్ని చోట్ల వర్షాల కారణంగా కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ పెరుగుతోంది.
- పెరిగిన కూరగాయల ధరలు
- వాతావరణ పరిస్థితులతో నష్టం
కోటబొమ్మాళి/ నరసన్నపేట, జూలై 24(ఆంధ్రజ్యోతి): నెల రోజుల కిందట సామాన్యులకు అందుబాటులో ఉండే కూరగాయల ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాభావం, మరికొన్ని చోట్ల వర్షాల కారణంగా కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయలకు గిరాకీ పెరుగుతోంది. టమాటా, బెండ, గోరుబిక్కుడు, పొడవుచిక్కుడు, బీర, కాకర, వంకాయలు, సారికంద.. ఇలా ఏ కూరగాయ అయినా సరే.. కిలో రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో సైతం ధరలు అందుబాటులో లేవని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కోటబొమ్మాళి రైతుబజారు, శ్రీపురం మార్కెట్‌తోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో మార్కెట్లలో నెల రోజుల కిందట బెండ, బీర, చిక్కుడు తదితర కూరగాయాలు కిలో రూ.20 నుంచి రూ.40లోపు విక్రయించేవారు. ప్రస్తుతం వీటిధరలు పెరగడంతో అరకిలోలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు. పంట దిగుబడి తగ్గడం, మరోవైపు శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కారణంగా కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కూరగాయలు ధరలు పెరుగుతుండగా, చికెన్ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడంతో మాంసప్రియులు ఊరట చెందుతున్నారు. రెండు వారాల కిందట కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.270 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.180 నుంచి రూ.200కు లభిస్తోంది. శ్రావణమాసం కారణంగా ఈ ధర మరింత తగ్గేఅవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
అదనపు భారం
వారానికి ఒకసారి రైతుబజార్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తాను. టమాటా, మిర్చి ధరలు రెట్టింపయ్యాయి. దొండ, బెండ, వంకాయ, బీర ధరలు అదేరీతిలో పెరిగాయి. నెల రోజుల కిందట సుమారు రూ.200 పెడితే కూరగాయల సంచి నిండేది. ప్రస్తుతం రూ.500 అయినా చాలడం లేదు. ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది.
-వి. శశిభూషణరావు, ఊడికలపాడు, కోటబొమ్మాళి మండలం.
....................
ధరలు ఇలా.. (కిలోల్లో)
-----------
కూరగాయలు నెల కిందట ప్రస్తుతం
--------------
టమాటా రూ.20 రూ.70
పచ్చిమిర్చి రూ.30 రూ.80
వంకాయ రూ.30 రూ.50
దొండకాయ రూ.30 రూ.45
బీరకాయ రూ.25 రూ.50
క్యారెట్ రూ.35 రూ.60
గోరుచిక్కుడు రూ.30 రూ.45
కాకర రూ.35 రూ.50