Left Handers Day: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:56 PM
Today is Left Handers Day ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’..అన్నాడో ఓ సినీ కవి. కుడి చేత్తో రాయడం నేర్చుకో. కుడికాలు పెట్టి లోపలకి రా.. అంటూ ఎడమను చాలామంది తక్కువగా చూస్తారు. ఈ వివక్ష ఎందుకనేది జవాబు దొరకని ప్రశ్న. చాలామంది సహజంగా ఏ పని అయినా కుడిచేత్తోనే చేస్తారు. కానీ.. కొందరు మాత్రం ఎడమచేతిని వినియోగిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారు.
నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే
మెళియపుట్టి/ శ్రీకాకుళం కల్చరల్/ సోంపేట/ సరుబుజ్జిలి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’..అన్నాడో ఓ సినీ కవి. కుడి చేత్తో రాయడం నేర్చుకో. కుడికాలు పెట్టి లోపలకి రా.. అంటూ ఎడమను చాలామంది తక్కువగా చూస్తారు. ఈ వివక్ష ఎందుకనేది జవాబు దొరకని ప్రశ్న. చాలామంది సహజంగా ఏ పని అయినా కుడిచేత్తోనే చేస్తారు. కానీ.. కొందరు మాత్రం ఎడమచేతిని వినియోగిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారు. వాస్తవానికి ఎడమ చేతివాటానికి చెందిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో రాణించారు. ఎడమచేతి రాతగాళ్లకు మెదడు చాలా స్పీడ్‌గా పనిచేస్తుందని, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని పలు పరిశోధనల్లో కూడా తేలింది. బుధవారం ‘లెఫ్ట్ హ్యాండర్స్ డే’ సందర్భంగా జిల్లాలో ఎడమచేతి వాటానికి చెందిన కొంతమంది విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం.
సరుబుజ్జిలి గ్రామానికి చెందిన బెండి చిన్నారావు అనే దివ్యాంగుడు ఎడమ చేతివ్రాతతోనే మండల విద్యాశాఖా కార్యాలయంలో సీఆర్‌ఎంటీగా విధులు నిర్వహిస్తున్నారు. ‘పోలియో వ్యాధి బారిన పడి చిన్నతనంలోనే రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. తండ్రి సాయంతో పాఠశాలకు వెళ్లేవాడిని. కుడిచేత్తో రాయలేకపోయేవాడిని. ఎడమ చేతితో రాయడం అలవాటు చేసుకున్నా. డబుల్ ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు బీఈడీ పూర్తి చేశాను. కుటుంబ సభ్యుల సహకారంతో సీఆర్‌ఎంటీగా పనిచేస్తున్నా’నని చిన్నారావు తెలిపారు. అలాగే సరుబుజ్జిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు సీపాన జగన్నాథరావుకు కూడా ఎడమ చేతివాటమే అలవాటు. డిజిటల్ బోర్డుపై ఎడమ చేతితో రాస్తూ.. బోధన సాగిస్తున్నారు.
శ్రీకాకుళంలోని రాధాకృష్ణనగర్‌కు చెందిన బ్యూటీషియన్ బీహెచ్ స్వాతి, గూనపాలెనికి చెందిన వసుంధర, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయుడు మురళీకృష్ణ తదితరులు ఎడమ చేతివాటంతోనే తమ వృత్తుల్లో రాణిస్తున్నారు. భోజనానికి మాత్రమే కుడిచేతిని వినియోగిస్తామని, మిగతా కార్యక్రమాలన్నీ ఎడమచేతితోనే చేస్తామని వారు తెలిపారు.
వైద్యుడిగా.. థర్మల్ ఉద్యమకారుడిగా గుర్తింపు
సోంపేటకు చెందిన డాక్టర్ వై.కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి ఎడమ చేతివాటమే అలవాటు. ఆయన ఓవైపు వైద్యసేవలు అందిస్తూ.. మరోవైపు థర్మల్ ఉద్యమ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమానికి మార్గదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ‘నా చిన్నప్పటి నుంచి ఏ పనైనా ఎడమచేతితో చేసేవాడిని. అప్పట్లో అంతా చిత్రంగా చూసేవారు. ఉన్నత చదువులు అనంతరం వైద్యవృత్తిలో సేవలు అందించాను. సోంపేట సమీపంలోని బీలలో ఏర్పాటు చేయదలచిన థర్మల్ పవర్‌ప్లాంట్ వల్ల పర్యావరణానికి కలుగనున్న నష్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాను. ఉద్యమం చేపట్టి థర్మల్‌ను అడ్డుకున్నామ’ని కృష్ణమూర్తి తెలిపారు.
అప్పట్లో హేళన చేశారు
నేను చిన్నప్పుడు ఎడమ చేతితో రాస్తే తరగతి గదిలో కొంతమంది హేళన చేశారు. నేను భోజనానికి మాత్రమే కుడిచేతిని వినియోగిస్తాను. క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఎడమ చేతిని వినియోగిస్తే నాకు కలిసివచ్చేది. అందుకే ఎడమచేతి వాటాన్ని అలవాటుగా మార్చుకున్నాను. మహాత్మ గాంధీజీ, అబ్దుల్‌కలాం వంటి మహనీయులు ఎడమ చేతితో రాస్తారని తెలుసుకుని మురిసిపోయేవాడిని. నేను తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన రోజు.. ఎడమ చేతితో సంతకం చేయడాన్ని చూసి కొంతమంది ఎమ్మెల్యేలు అభినందించడం సంతోషంగా భావించాను.
- మామిడి గోవిందరావు, పాతపట్నం ఎమ్మెల్యే
............
కొత్త అనుభూతి ఇస్తోంది
చిన్నతనం నుంచి ఎడమచేతిరాతకు అలవాటు పడ్డాను. ఎదుటవారు కుడిచేతితో రాస్తుంటే.. నేను ఎడమ చేతితో రాస్తుండడం భిన్నంగా అనిపించేది. ఉన్నతచదువులు పూర్తిచేసినా ఎడమచేతి వల్ల ఎటువంటి ఇబ్బంది రాలేదు. రాత కూడా సక్రమంగా వచ్చేది. తప్పులు దొర్లకుండా రాస్తుండడం ఒక అనుభూతి. చదువుతున్న కాలంలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా రాస్తుండడాన్ని అంతా వింతగా చూసేవారు. ఉపాధ్యాయులు కూడా నన్ను ప్రోత్సహించారు.
- ఎన్.రామారావు, మునిసిపల్ కమిషనర్, పలాస-కాశీబుగ్గ