Rice adulteration: కల్తీ.. తూకంలో దగా
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:35 AM
Rice Fraud in weighing జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస, ఆమదాలవలస తదితర పట్టణాల్లో సన్నబియ్యం పేరుతో బియ్యం వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్నారు.ఓవైపు కల్తీ.. మరోవైపు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.
మోసం చేస్తున్న బియ్యం వ్యాపారులు
రంగురంగుల ప్యాకింగ్‌తో బురిడీ
26 కేజీల పేరుతో జీఎస్టీ ఎగనామం
నరసన్నపేట, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి):
నరసన్నపేటలో ఒక కిరాణాషాపులో జమ్ము గ్రామానికి చెందిన బి.మోహనరావు ఇటీవల వివాహ శుభకార్యం నిమిత్తం ఐదు బస్తాల సన్నబియ్యం కొనుగోలు చేశారు. పెళ్లిరోజున వంటకాలు చేసే సమయంలో బియ్యం బస్తాలు తెరవగా.. సన్నబియ్యం 60శాతం.. 40శాతం మిగతా రేషన్ బియ్యం కల్తీ చేసినవి ఉన్నాయి. ఈ విషయాన్ని షాపు యాజమానికి ఫోన్‌లో తెలియజేయగా.. ఎక్కడో తప్పు జరిగింది. వాటిని తెస్తే.. మరో బియ్యం బస్తాలు ఇస్తామని షాపు యాజమాని తెలిపారు.
శ్రీకాకుళం ఒక ఉపాధ్యాయుడు సన్నబియ్యం బస్తా కొనుగోలు చేశారు. బియ్యం బస్తాపై 26 కేజీల ముద్ర ఉంది. తీరా తూకం వేస్తే 25కేజీలు మాత్రం ఉన్నాయి. దీనిపై షాపు యాజమానిని ప్రశ్నించగా.. బస్తాపై 25 కేజీలు ఉంటే జీఎస్టీ వసూళ్లు చేస్తారు. కాబట్టి.. బియ్యం బస్తాపై 26 కేజీలు ఉన్నట్టు ముద్రించినా.. మీ దగ్గర 25 కేజీలకే డబ్బులు తీసుకుంటున్నామని షాపు యాజమాని చెప్పారు.
.. ఇలా జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, కోటబొమ్మాళి, టెక్కలి, పలాస, ఆమదాలవలస తదితర పట్టణాల్లో సన్నబియ్యం పేరుతో బియ్యం వ్యాపారులు వినియోగదారులను దోచుకుంటున్నారు.ఓవైపు కల్తీ.. మరోవైపు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి.. సన్నబియ్యం పేరిట వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన రంగుల బస్తాలో ప్యాకింగ్ చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు, వ్యాపారులు ఒక్కటై అక్రమాలు సాగిస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతులు సైతం కొన్నాళ్లుగా ధాన్యాన్ని మిల్లింగ్ చేసుకోవడం లేదు. సన్నబియ్యం కొనుగోలు చేసుకునే తింటున్నారు. దీంతో బియ్యం వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. రైస్‌మిల్లర్లు కొందరు లోకల్ బ్రాండ్లు ఉన్న బస్తాల్లో రేషన్ బియ్యం నింపి విక్రయిస్తున్నారు. మరికొందరు హోల్‌సేల్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి.. మిల్లింగ్ వేయించి ఇష్టానుసారంగా బ్రాండ్లు పేరుతో బియ్యం విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం 25 కిలోల బియ్యం బస్తాకు జీఎస్టీ చెల్లించాలి. ఈ నేపథ్యంలో బస్తాపై 26 కిలోలుగా ముద్రిస్తూ వ్యాపారులు జీఎస్టీకి ఎగనామం పెడుతున్నారు. మరోవైపు ఆ బస్తాలో రెండు, మూడు కిలోల బియ్యం తగ్గించి విక్రయిస్తూ వినియోగదారులను మోసగిస్తున్నారు.
కొందరు బియ్యం వ్యాపారులు మిల్లర్లతో మిలాఖత్ అయి.. ముందుగానే 100 కేజీల బియ్యంలో 25 కేజీలు సాధారణ బియ్యాన్ని లేదా రేషన్ బియ్యాన్ని కల్తీ చేస్తున్నారు. మిల్లర్లు మరపెట్టే సమయంలో 75 కేజీల సన్నరకం బియ్యాన్ని పాలిస్ చేస్తారు. వాటిని ఒక పెద్దబస్తాలో వేస్తారు. తర్వాత 25 కేజీల రేషన్ బియ్యాన్ని పాలిస్ చేసి.. మెరుపు వచ్చేందుకు నూనె వేస్తారు. రెండు కల్తీ చేసి బస్తాల్లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు.
సార్ట్‌టెక్స్ పేరుతో దోపిడి
బియ్యం వ్యాపారులు కొందరు సార్ట్‌టెక్స్ పేరుతో దగాకు పాల్పడుతున్నారు. సార్ట్‌టెక్స్‌లో బియ్యంలో 0 శాతం బ్రోకింగ్ బియ్యం(నూకలు), బియ్యంపై ఎటువంటి మచ్చ(రంగుమారిన) అనేది ఉండకూడదు. కానీ కొన్ని కంపెనీలకు చెందిన బస్తాలపై సార్ట్‌టెక్స్ పేరుతో కనిపిస్తాయి. తీరా ఇంటికి తీసుకెళ్లి ఆ బియ్యం బస్తా తెరవగా.. బియ్యంలో రాళ్లు, నూకలు, రంగుమారిన గింజలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సార్ట్‌టెక్స్ బియ్యం బస్తా(25కేజీలు)పై రూ.150 నుంచి రూ.300 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. ఇలా క్వింటా బియ్యానికి సార్ట్‌టెక్స్ పేరుతో నూనె కలిపి మరపట్టిన బియ్యానికి అదనంగా రూ.1200వరకు మిల్లర్లు, వ్యాపారులు దోచేస్తున్నారు.
ధాన్యం బస్తాకు ధర తక్కువే..
ఈ ఏడాది రైతులు పండించే సన్నరకాల ధాన్యానికి సరైన ధర లేకపోవడంతో రైతుల వద్ద మిల్లర్లు 80కేజీల బస్తా రూ.1600 నుంచి రూ.1700 వరకు కొనుగోలు చేశారు. ఈ సన్నబియ్యం మరపెడితే సుమారు 55 కేజీల బియ్యం దిగుబడి వస్తుంది. వీటిని ప్యాకింగ్ చేసి ఒక్కో బియ్యం బస్తాను(26 కేజీలు) రూ.1200 నుంచి రూ.1400కు విక్రయిస్తున్నారు. అంటే రెండు బస్తాల బియ్యాన్ని రూ.2,800 వరకు విక్రయిస్తున్నారు. మిల్లర్లుకు మరపెట్టేందుకు, హమాలీ వేతనాలు, విద్యుత్ చార్జీలు, ఇతర ఖర్చులకు మిల్లింగ్ చేపట్టే పొట్టు, తవుడు, బ్రోకెన్ బియ్యం సరిపోతాయి. ఇలా రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. బస్తాకు రూ.వెయ్యి వరకూ మిల్లర్లు, వ్యాపారులు లాభపడుతున్నారు.
పట్టించుకోని అధికారులు
బియ్యం తూకం తక్కువ విషయంలో కానీ, జీఎస్టీ చెల్లించని వ్యాపారులపై కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్లు, వ్యాపారుల వద్ద కొంతమంది అధికారులు మామూళ్లు తీసుకుని అక్రమాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారిణి చిన్నమ్మి వద్ద ప్రస్తావించగా ‘ఇప్పటికే టెక్కలి, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో షాపులపై దాడులు నిర్వహించాం. తూకాల్లో మోసాలు చేసే వ్యాపారులపై కేసులు నమోదు చేశామ’ని తెలిపారు. తూకంలో మోసం చేసినా, కల్తీకి పాల్పడినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.