Share News

పునర్దర్శనం ప్రాప్తిరస్తు

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:10 AM

Green signal to open Sri Venkateswara Swamy Temple కాశీబుగ్గ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (చిన్న తిరుపతి) తెరిచి.. భక్తులకు దర్శనం కల్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం నుంచి ఆలయాన్ని తెరిచేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 1న ఏకాదశి నాడు ఈ ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడిన విషయం తెలిసిందే.

పునర్దర్శనం ప్రాప్తిరస్తు
కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం

  • కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌

  • సోమవారం నుంచి దర్శనాలకు అవకాశం

  • త్రిసభ్య కమిటీ సూచన మేరకు ఏర్పాట్లు

  • పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని (చిన్న తిరుపతి) తెరిచి.. భక్తులకు దర్శనం కల్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం నుంచి ఆలయాన్ని తెరిచేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 1న ఏకాదశి నాడు ఈ ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా దేవదాయశాఖ కమిషనర్‌ ప్రసాదరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ఏఎస్పీ కేవీ రమణతో కూడిన త్రిసభ్య కమిటీని వేసింది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. ‘ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చాలి. ఆలయంలోకి వెళ్లేందుకు పటిష్టమైన ఐరన్‌/స్టీల్‌ రైలింగ్‌ ఏర్పాటు చేయాలి. ఆలయంలో ప్రైవేటు భద్రత కల్పించాలి’ అని కమిటీ సభ్యులు ఆలయ నిర్వాహకులకు సూచించారు. వాటిని పూర్తిచేసి ఆలయాన్ని తెరిపించుకోవచ్చని చెప్పారు.

  • ముమ్మరంగా పనులు

  • త్రిసభ్య కమిటీ సూచనల మేరకు శ్రీవేంకటేశ్వరాలయంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. భక్తులు మృతికి కారణమైన అవుట్‌గేట్‌ రైలింగ్‌ మొత్తం బయటకు తీసి కొత్తవి అమర్చుతున్నారు. ఆలయంలో వెనుక నుంచి ఓ మార్గం, పక్క నుంచి మరో మార్గం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువైతే మొత్తం మూడు మార్గాలు తెరిచి బయటకు పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆలయం మొత్తం 12.22 ఎకరాలు. అందులో రెండు ఎకరాల్లో ప్రధానంగా శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. దానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉన్నాయి. ఆలయం మొత్తం రామాయణ, మహాభారత ఘట్టాలు, వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటిని చూసిన తరువాత వెంకటేశ్వరస్వామిని దర్శించిన అనంతరం వచ్చిన మార్గం నుంచి కాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మార్గాల ద్వారా బయటకు వెళ్లడానికి నిర్మాణాలు జరుగుతున్నాయి. స్వామి ఆలయం దక్షిణ భాగాన రెండు భారీ అన్నదాన సత్రాలు నిర్మించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా బయటకు వచ్చిన మార్గం గుండా సత్రాల్లోకి ప్రవేశించి అన్నదానంలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు. ఆలయం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలను అమర్చి.. కమాండ్‌ కంట్రోల్‌ను ఆలయం లోపల భాగంలో ఏర్పాటు చేశారు. ఆలయం మొత్తం ఇప్పటికే నీటితో శుద్ధి చేసి తీర్చిదిద్దారు. కొత్తగా పరమశివుడు, సూర్యభగవానుడి 30అడుగు విగ్రహాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • ఇదిలా ఉండగా కమిటీ సూచన చేసి నిర్వాహకులకు ఆలయం అప్పగించినా.. ఇంకా పోలీసుల నిఘా కొనసాగుతోంది. భక్తుల దర్శనం కోసం ఆలయం తెరిచిన వరకే నిఘా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

  • ఆలయ నిర్వాహకుడు హరిముకుందపండా మాట్లాడుతూ ‘భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు నేరుగా స్వామి దర్శనానికి వెళ్లి.. వెనుక మార్గం గుండా బయటకు రావడానికి ఏర్పాట్లు చేశాం. ఏకాదశి నాడు జరిగిన సంఘటన బాధాకరం. భక్తులు సంయమనం పాటిస్తే ఇటువంటి ఇబ్బందులు ఉండవు. అందరికీ కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నా’నని తెలిపారు.

Updated Date - Nov 14 , 2025 | 12:10 AM