అనుమతులు వెనక్కి
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:39 PM
No Repairs to lift irrigation schemes జిల్లాలో సాగునీటి రంగం లక్ష్యం నీరుగారుతోంది. పొలాలకు నీరందించాల్సిన ఎత్తిపోతల పథకాలు నిధుల లేమితో వెక్కిరిస్తుండగా.. కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం, అధికారులు కాగితాలపై లెక్కలు వేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) తాజా నివేదికను పరిశీలిస్తే.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది.
అటకెక్కిన ఎత్తిపోతల పథకాల మరమ్మతులు.. ఆపై కొత్త ప్రతిపాదనలు
ఏడు పథకాలకు రూ.50 కోట్లు ఇవ్వడానికి మీనమేషాలు
అనుమతులు ఇచ్చి మళ్లీ రద్దు చేసిన వైనం
ఏడు వేల ఎకరాలకు సాగు నీరిస్తామన్న మాట బుట్టదాఖలు
కాగితాలకే పరిమితమైన రైతుల సాగునీటి కలలు
జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించాలని వినతులు
శ్రీకాకుళం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి రంగం లక్ష్యం నీరుగారుతోంది. పొలాలకు నీరందించాల్సిన ఎత్తిపోతల పథకాలు నిధుల లేమితో వెక్కిరిస్తుండగా.. కొత్త ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం, అధికారులు కాగితాలపై లెక్కలు వేయడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) తాజా నివేదికను పరిశీలిస్తే.. జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు రూ.కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి 41 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. వీటిద్వారా 37,255 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకాల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సివిల్, ఎలకో్ట్ర-మెకానికల్ మరమ్మతులు లేక 34 పథకాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. మిగిలిన ఏడు పథకాలు పూర్తిగా మూలనపడ్డాయి. ఈ పథకాలను పునరుద్ధరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలంటే దాదాపు రూ.50.30కోట్లు అవసరమని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ. 97.79కోట్లు కావాలి. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండగా.. రైతులు మాత్రం సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
గతంలో మంజూరైన 7 ఎత్తిపోతల పథకాలకు రూ.55.62 కోట్లతో 6,997 ఎకరాలకు నీరిచ్చేలా అనుమతులు వచ్చినా.. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాటిని రద్దు చేయడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ వాటికే పరిపాలనా అనుమతుల కోసం ‘కొత్తగా’ ప్రతిపాదనలు పంపడం అధికారుల కాలయాపనకూ.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు అద్దం పడుతోంది.
నత్తనడకన నిర్మాణాలు
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పథకాల తీరు కూడా ఆశాజనకంగా లేదు. నత్తనడకన పనులు సాగుతున్నాయి. రూ.180 కోట్లతో చేపడుతున్న ‘బొంతు- సారవకోట- కొత్తూరు’ ఎత్తిపోతల పథకం వచ్చే జనవరి నాటికి పాక్షికంగా కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు. ‘తండ్యాం- కళింగపట్నం’ పథకం పనులు పునఃప్రారంభించామని చెబుతున్నా.. పూర్తయ్యేందుకు ఇంకా ఏళ్లు పట్టేలా ఉంది.
730 ఎకరాలకు నీరివ్వాల్సిన మజ్జిగూడెం(హిరమండలం) ఎత్తిపోతల పథకం పనులు ఇంతవరకు ప్రారంభమే కాలేదు. కాంట్రాక్టరు పనులు చేయకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోయినా ఇన్నాళ్లూ అధికారులు ఏమి చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగితాల్లో నవశకం..
పాత ఎత్తిపోతల పథకాలు బాగుచేయడానికే నిధులు లేవు కానీ.. కొత్తవాటికి మాత్రం కొదవలేదు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదుల ఆధారంగా మడపాం, అంబాలవలస, కొసమాల, సీది, లోలుగు తదితర ప్రాంతాల్లో కొత్త ఎత్తిపోతల పథకాలకు (సుమారు 20వేల ఎకరాలకు పైగా ఆయకట్టు) సవరించిన అంచనాలు పంపామని నివేదిక చెబుతోంది. ఆలస్యమైనా ‘బొంతు-సారవకోట, తండ్యాం-కళింగపట్నం’ వంటి పథకాలను 2025-26 నాటికి పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. సీది, లోలుగు వంటి కొత్త ప్రాంతాల్లో 9,977 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇవి కార్యరూపం దాల్చితే ఆయా మండలాల స్వరూపం మారుతుంది.
ఇలా చేస్తే మేలు..
కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనల మోజులో పడి.. ఉన్న 41 ఎత్తిపోతల పథకాలను గాలికి వదిలేయకుండా బాగుచేయాలి. తక్షణమే మరమ్మతులకు రూ.50కోట్లు విడుదల చేసి వాటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి. రద్దు నిర్ణయాలు, మళ్లీ ప్రతిపాదనలతో సమయం, అంచనా వ్యవయం రెండూ పెరుగుతాయి. ఇది ప్రజాధనాన్ని వృఽథా చేయడమే. కేవలం ప్రభుత్వానికి అంచనాలు పంపి, చేతులు దులుపుకొంటే సరిపోదు. ఆమోదం పొందేలా ఒత్తిడి తెచ్చి, నిధులు సాధించినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.